సాగునీటి స్వాప్నికుడు ఇకలేరు
► అనారోగ్యంతో కన్నుమూసిన ఆర్.విద్యాసాగర్‌రావు
► నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జలయోధుడు కన్నుమూశారు! సాగునీటి దోపిడీని ఎండ గట్టి, తెలంగాణ నీళ్ల కోసం పోరాడిన ఆ గొంతు మూగబోయింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు రాంరాజు విద్యాసాగర్ రావు(78) ఇక లేరు. కొంతకాలంగా మూత్రా శయ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శని వారం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసు పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడి చారు. ఈ నెల 22న ఆస్పత్రిలో చేరిన ఆయన గత 4 రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్నారు.
ఆయన్ను బతికించేందుకు వైద్యులు ప్రయ త్నించినా ఫలితం లేకుండా పోయింది. అంబ ర్‌పేట శ్మశానవాటికలో ఆదివారం 10:30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్య క్రియలు జరగనున్నాయి. ఈయన స్వగ్రామం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం. 1939 నవంబర్ 14న రాఘవరావు–లక్ష్మమ్మ దంప తులకు రెండో సంతానంగా జన్మించిన విద్యాసాగర్‌రావుకు భార్య సుజాత, కుమారు డు రమణ, కుమార్తె అపర్ణ ఉన్నారు.
పల్లెటూరి నుంచి ప్రపంచ స్థాయికి..
విద్యాసాగర్‌రావు అంచలం చెలుగా ప్రపంచ స్థాయికి ఎదిగారు. 1 నుంచి 7వ తరగతి వరకు తిరుమలగిరి, హుజూర్‌నగర్‌లలో చదివారు. 8,9,10 తరగతులు మిర్యాల గూడలో, ఇంటర్ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో ఇంటర్ చదివిన ఆయన 1960లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. 1979లో రూర్కీ యూనివర్సిటీ నుంచి వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. అనంతరం 1983లో అమెరికాలోని కొలరాడో యూని వర్సిటీ నుంచి డిప్లొమా పూర్తి చేసి, 1990లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ వర్క్స్ విభాగంలో జూనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టారు.
అనంతరం కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లో 30 ఏళ్ల పాటు సేవ లందిం చారు. అనంతరం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ)లో చీఫ్ ఇంజనీర్(దక్షిణ)గా రెండేళ్లు, కేంద్ర జల వన రుల శాఖ వాటర్ మేనేజ్‌మెంట్ కమిషనర్‌గా ఏడాదికిపైగా సేవలందించారు. అనంతరం నైరోబీ(కెన్యా)లో, అడీస్ అబాబా (ఇథియోపి యా)లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్‌మెంటల్ ప్రోగ్రామ్(యూఎన్‌ఈఇపీ)కు కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఈ సమయంలోనే నైలు నది, వొకవోంగో నది బేసిన్‌ల నిర్వహణ, అవస రాలు, పర్యావరణ అనుకూలతలు అన్న అంశాలపై నివేదికలు రూపొందించారు.
వీటి తోపాటు మహానది, కృష్ణా, గోదా వరి, నర్మద, సబర్మతి, తపతి నదీ బేసిన్లకు సంబంధించి నీటి వనరుల వినియోగం, నదు ల అనుసంధానం, భారీ ప్రాజెక్టుల నిర్మా ణం వంటి అంశాలపై అధ్యయ నాలు చేసి కేంద్రానికి మార్గనిర్దేశం చేశారు. తమిళ నాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ప్రపంచబ్యాంకు హైడ్రాలజీ ప్రాజెక్టులకు సేవలందించారు. ఇంజనీరింగ్ విభాగంలో విశేష కృషి చేసిన విద్యాసాగర్ రావుకు 2014లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ సంస్థ ‘లీడింగ్ ఇంజనీరింగ్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా’అవార్డును ప్రదానం చేసింది. ఇండియన్ వాటర్ రిసోర్సెస్, ఇండియన్ నెట్‌వర్క్ ఆన్ పార్టిసిపేటరీ ఇరిగేషన్ మేనేజ్ మెంట్‌లు జీవిత కాల సభ్యత్వాలు ఇచ్చాయి.
కేసీఆర్‌కు పాఠాలు నేర్పిన మాస్టారు
కేవలం పునాది రాళ్లకే పరిమితమైన తెలంగా ణ ప్రాజెక్టులను చూసి విద్యాసాగర్‌రావు తీవ్ర ఆవేదన చెందేవారు. తెలంగాణ రైతుల దీనగా«థలపై అప్పటి ఉద్యమ నేత కేసీఆర్‌కు పాఠాలు బోధించారు. కృష్ణా, పెన్నా బేసిన్‌ల మధ్య ఉమ్మడి ఏపీలో నిర్మించిన పోతిరెడ్డి పాడు తెలంగాణకు ఉరితాడు అవుతుందని హెచ్చ రించారు. కృష్ణా జలాల అంశంలో నీటి దామాషాను పాటించకుంటే వచ్చిన నీటిని వచ్చినట్లు ఎగువ రాష్ట్రాలు వాడుకుంటా యని, అలా జరిగితే అది దిగువ రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తొలిసా రిగా తేల్చిచెప్పింది విద్యాసాగర్‌రావే.
‘నీళ్లు–నిజాలు’పేరిట ఆయన రాసి న పుస్తకంలో... ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో తెచ్చిన జీవోలు, వాటితో జరిగే నష్టం, తెలంగాణ ప్రజలను మభ్యపె డుతున్న తీరుని వివరించారు. నీటిపారుదల రంగంలో అపార అనుభవం ఉన్న విద్యా సాగర్‌రావును రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్.. సాగునీటి సలహాదారుగా నియమిం చారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల డిజైన్‌లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
సాహిత్యం, కళా రంగంలోనూ..
విద్యాసాగర్‌రావు ఇంజనీర్‌గానే కాకుం డా సాహిత్యం, కళా రంగంలోనూ రాణిం చారు. ఆయన వివిధ పత్రికలకు 130కి పైగా వ్యాసాలు రాశారు. గోల్కొండ పత్రికలో ‘శిలాసుమాలు’అనే ధారావాహికను రచించా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచించిన ‘నీళ్లు–నిజాలు’పుస్తకం ఓ సంచల నం. నీటి విషయంలో తెలంగాణకు జరుగు తున్న వివక్షను ఈ పుస్తకం కళ్లకు కట్టింది. ఉద్యమ సమయంలోనే వచ్చిన ‘జైబోలో తెలంగాణ’సినిమాలో కీలక పాత్రధారిగా స్మృతి ఇరానీకి తండ్రి పాత్రలో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘దమ్ము’తోపాటు పలు సీరియల్స్‌లోనూ నటించారు.
సీఎం కేసీఆర్ కంటతడి..
విద్యాసాగర్‌రావు మరణ వార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఆయన నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చా రు. విద్యాసాగర్‌రావుతో తన అనుబంధాన్ని గుర్తుకుతెచ్చుకున్న సీఎం కళ్లు చెమర్చారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, జూపల్లి, ఎంపీ కవిత, వినోద్, మల్లారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఎర్రబెల్లి , సీఎం క్యాంపు కార్యాలయం ప్రత్యేక అధికారి స్మితా సబర్వాల్, సినీ డైరెక్టర్ శంకర్, జేఏసీ చైర్మన్ కోదండరాం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాసంఘాల నేతలు కూడా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
విద్యాసాగర్‌రావు మృతిపై ప్రముఖుల సంతాపాలు
విద్యాసాగర్‌రావు అపార అనుభవశాలి
నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. విద్యాసాగర్‌రావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్య్లూసీ)లో ఉన్నపుడు ఆయన అందించిన సేవలు గొప్పవి. విద్యాసాగర్‌రావు అపారమైన అనుభవశాలి. సాగునీటి రంగంపై తిరుగులేని పరిజ్ఞానం కలవారు.
– వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
రాష్ట్రం గొప్ప మేధావిని కోల్పోయింది..
తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప మేధావిని, ఇంజనీర్‌ను, సాగునీటి రంగ శాస్త్రవేత్తను, తెలంగాణవాదిని కోల్పోయింది. సీఎం కేసీఆర్‌కు ఇరిగేషన్ నిపుణుడిగా విద్యాసాగర్ రావు వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఆయన లేని లోటు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం పూడ్చలేనిది. – రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు
లోటు పూడ్చలేనిది
విద్యాసాగర్‌రావు లేని లోటు పూడ్చలేనిది. రాష్ట్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించి.. నీటిపారుదల రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. – కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
దిగ్భ్రాంతికి గురిచేసింది
విద్యాసాగర్‌రావు మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణలో ప్రతి ఇంటికి, ప్రతిగడ్డకు నీరు అందించాలని పరితపించేవారు.
– శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్
తెలుగు వారికి తీరని లోటు
నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తెలుగు ప్రజలకు అన్యాయం జరగకూడదని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌రావు. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని నష్టం. – హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
సాగునీటి దోపిడీని గొంతెత్తి చెప్పిన వ్యక్తి
సాగునీటి దోపిడీని తెలంగాణ ఉద్యమం సందర్భంగా గొంతెత్తి చెప్పిన వ్యక్తి విద్యా సాగర్‌రావు. ఆయన లేని లోటు తీరనిది. – రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు
అన్యాయాన్ని ప్రజలకు వివరించారు..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీటి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని ఎప్పటి కప్పుడు ప్రజలకు అవగాహన కల్పించిన వ్యక్తి విద్యాసాగర్‌రావు. – రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రైతాంగానికి తీరని లోటు
విద్యాసాగర్‌రావు మృతి తెలంగాణ రైతాంగానికి తీరని లోటు. రాష్ట్ర సాధనలో దాదాపు ఆరేళ్లపాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నాను. మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. – రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎ.రామలక్ష్మణ్
ఉత్తమ్, జానా, భట్టి, కోదండరాం, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి సంతాపం
విద్యాసాగర్‌రావు మృతికి పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి సంతాపం తెలిపారు. సాగునీటి కోసం శ్రమించిన విద్యాసాగర్‌రావు మృతి తెలంగాణకు తీరని లోటని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.