
వచ్చే ఏడాది ఖరీఫ్‌కు కాళేశ్వరం
నీళ్లందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం
- మార్చి నాటికి మేడిగడ్డ పనులు పూర్తి చేసి మల్లన్నసాగర్ వరకు నీళ్లందించాలి
- ప్రభుత్వానికి ప్రాజెక్టులే అత్యంత ప్రాధాన్యాంశం
- నిధుల కొరత లేదు.. పనుల్లో వేగం పెంచాలి
- భూసేకరణ చట్టానికి త్వరలోనే క్లియరెన్స్ వస్తుంది
- సాగునీటి ప్రాజెక్టులపై విస్తృత స్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లను పొలాలకు పారించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికే మేడిగడ్డ పనులు పూర్తి చేసి మల్లన్నసాగర్ వరకు నీళ్లందించాలని స్పష్టంచేశారు. ‘‘గోదావరిలో 954 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల వాడలేకపోతున్నాం. మనకు కేటాయించిన నీళ్లను మనం వాడుకోవాలి. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ప్రధానమైనది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ పనులతో పాటు ఇతర పనులు సమాంతరంగా సాగాలి. బ్యారేజీ నిర్మాణానికి ముందే మేడిగడ్డ నుంచి నీటిని తోడుకోవడానికి కావాల్సిన నిర్మాణాలు పూర్తి చేయాలి.
2018 మార్చి నాటికి ఈ పనులు పూర్తి కావాలి. వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందించాలి. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు, అక్కడ్నుంచి మల్లన్న సాగర్ వరకు నీరందించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టాలి. ఛానళ్లలో ఇసుక పేరుకుపోకుండా చూడాలి. ఇందుకు అంతర్జాతీయంగా అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. చైనాలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను గొప్పగా నిర్వహిస్తున్నారు. నీటిపారుదల మంత్రి ఆధ్వర్యంలో అధికారులు, ఇంజనీర్ల బృందం చైనా పర్యటించి.. అక్కడ అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలి’’అని సీఎం సూచించారు. ‘‘సివిల్, ఎర్త్ వర్క్‌లతోపాటు మోటార్లు, ఇతర ఎలక్ట్రో మెకానికల్ సామగ్రిని సేకరించుకోవాలి.
లిఫ్టులకు అవసరమైన సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం జరిగేలా విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలి. అటవీ అనుమతులు సాధించేందుకు అవసరమైతే నేనే ఢిల్లీ వెళ్లి మాట్లాడతా’’అని చెప్పారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎండీసీ చైర్మన్ సుభాష్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, కార్యదర్శి వికాస్ రాజ్, ఈఎన్‌సీ మురళీధర్ ఇందులో పాల్గొన్నారు. ప్రాజెక్టుల వారీగా ప్రస్తుత పరిస్థితిని, ఎదురవుతున్న సవాళ్లను, వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను, ఎప్పటివరకు పూర్తి చేయగలమనే అంశాలను క్షుణ్ణంగా చర్చించారు.
వచ్చే నాలుగేళ్లు మంచి వర్షాలే..
‘‘గతేడాదిలాగే ఈసారి కూడా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాస్తవేత్తలు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం ఉండదంటున్నారు. వచ్చే నాలుగేళ్లు కూడా మంచి వర్షాలే పడే అవకాశం ఉంది..’’అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఇది శుభ పరిణామం. ప్రాజెక్టుల నిర్మాణం మన ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశం. అందుకే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాం. ప్రతీ నెలా చెల్లింపులు చేస్తాం. నిధుల కొరత లేకుండా చేస్తాం. కాబట్టి పనుల్లో వేగం పెంచాలి..’’అని సూచించారు.
కాల్వల సామర్థ్యం పెంచుదాం
బ్యారేజీలు, రిజర్వాయర్లు కట్టుకుని కాల్వలు బాగు చేసుకోకుంటే ఫలితం ఉండదని, వాటి సామర్థ్యం పెంచడం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. ఎల్‌ఎండీ ఎగువన, దిగువన ఉన్న కాలువలను పూర్తిస్థాయి ప్రవాహ సామర్థ్యానికి తగ్గట్టు తీర్చిదిద్దాలని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలను కూడా మెరుగుపర్చాలని సూచించారు. ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది? ఏం చేయాలి? సామర్థ్యం పెంచేందుకు ఏం చేయాలి? ఆ కాల్వలను వెడల్పు చేయడమా? కొత్తగా కాల్వలు తవ్వడమా? అనే అంశాలపై అధ్యయనానికి ఇంజనీర్లతో కమిటీని వేయాలని సూచించారు. ‘‘ఆదిలాబాద్‌లో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఓ జోక్‌గా మారాయి. ప్రాజెక్టులున్నా నీరుండదు. నీరుంటే కాల్వలుండవు. అక్కడ వర్షపాతం ఎక్కువ. గ్రావిటీ ద్వారానే నీరిచ్చే అవకాశమున్న ఈ జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి..’’అని సీఎం ఆదేశించారు.
ఇందుకు మంత్రి హరీశ్ సమాధానమిస్తూ ‘‘ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాపై దృష్టి పెట్టాం. గడ్డెన్నవాగు ప్రాజెక్టు ద్వారా 10 వేల ఎకరాలకు నీరిచ్చాం. సాత్నాల, ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టులు వచ్చే జూలై నాటికి పూర్తి చేస్తాం. చెర్వుల బాగు, కొత్త చెరువుల నిర్మాణంతో 70 వేల ఎకరాలకు కొత్తగా నీరిచ్చాం. అన్ని మీడియం ప్రాజెక్టులు వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తాం. కొత్తగా చేపట్టే వాటిని శరవేగంగా పూర్తి చేస్తాం’’అని చెప్పారు. ‘కాకతీయ కెనాల్ ను బాగు చేసుకుని కోదాడ దాకా నీరందే ఏర్పాట్లు చేయాలి. సదర్‌మట్ పనుల్లో వేగం పెంచాలి. ఎస్సారెస్పీ పుతున్నాం కాబట్టి పత్తిపాక రిజర్వాయర్ అవసరమా? అవసరమైతే ఎన్ని టీఎంసీలతో నిర్మించాలి? అనే విషయం పరిశీలించాలి. నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ద్వారా బోధన్ వరకు నీరిచ్చే అవకాశాలు పరిశీలించాలి. ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీకి నీరందిస్తున్నాం. మంచిపట్టు రిజర్వాయర్ సామర్థ్యం కూడా 5 టీఎంసీల వరకు పెంచే అవకాశాలు పరిశీలించాలి. పులిచింతల నుంచి గ్రావిటీ ద్వారా ఎంతవరకు నీటిని వాడుకోవచ్చో పరిశీలించాలి’’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్‌కు ఓకే..
కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్‌తో రోజుకు 0.75 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలన్న మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను సీఎం పరిశీలించారు. దీన్ని ఆమోదించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరగా.. అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. రూ.650 కోట్ల వ్యయంతో ఒక టీఎంసీ వరకు నీటిని లిఫ్ట్ చేసి, కామారెడ్డి, ఎల్లారెడ్డి దాకా ఎస్సారెస్సీ ద్వారానే నీరందించాలని సీఎం చెప్పారు. ‘‘ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పూర్తయ్యే వరకు ఎదురు చూడకుండా... నదీజలాలను చెరువులకు తరలించాలి. దీంతో భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. బోర్ల ద్వారా వ్యవసాయం సాగుతుంది. తెలంగాణలో 25 లక్షల బోర్లున్నాయి. వాటికి కావాల్సిన కరెంటు కూడా అందిస్తున్నాం. కాబట్టి భూగర్భ జలాలు పెరగడం చాలా అవసరం. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ చెరువులు నింపాలి’’అని సూచించారు.
భూసేకరణ చట్టానికి క్లియరెన్స్ వస్తుంది..
‘‘భూ సేకరణ విషయంలో చిక్కులన్నీ తొలగిపోతాయి. మనం చేసిన చట్టం కేంద్రానికి పంపాం. అక్కడ్నుంచి క్లియరెన్స్ వస్తుంది. ఆ చట్టం వల్ల రైతులకు మేలు ఎక్కువగా జరుగుతుంది. భూసేకరణ కూడా వేగవంతం అవుతుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత కూడా లేదు. కావాల్సిన డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’అని సీఎం తెలిపారు. ‘‘ప్రాజెక్టుల పనులు పెద్ద ఎత్తున చేస్తున్నందున రిటైర్డ్ ఇంజనీర్ల సేవలు వినియోగించుకోవాలి. రిటైర్ కాబోతున్న వారు ఆసక్తి కనబరిస్తే వారికి ఎక్స్ టెన్షన్ ఇస్తాం. అవసరమైన సిబ్బందిని కూడా నియమిస్తాం. పంపింగ్ స్టేషన్లు, ఇన్ టేక్ వెల్స్ నిర్వహించడానికి విద్యుత్ ఇంజనీర్లను నియమిస్తాం’’అని తెలిపారు.