టీవీ-9 వ్యాఖ్యలు అమానవీయం: కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ పట్ల వ్యంగ్యంగా వార్తలు ప్రసారం చేస్తే ప్రసార మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కొన్ని ఛానెళ్లు, పత్రికల తీరుపై శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. తెలంగాణ శాసనసభ, ఎమ్మెల్యేలను అవమానించిన మీడియాపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు.
తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరిచిన మీడియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. టీవీ-9, ఆంధ్రజ్యోతిలపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రమాణ స్వీకారం చేసిన శాసన సభ్యుల బొమ్మలు చూపిస్తూ టీవీ-9 ఛానల్ చేసిన వ్యాఖ్యలు అమానవీయమన్నారు.
''టూరింగ్ టాకీస్లో సినిమాలు చూసేవారిని తీసుకొచ్చి మల్టీఫెక్స్లో కూర్చోబెడితే ఎలా ఉంటుందో... తెలంగాణ శాసనసభ అలాం ఉందని వ్యాఖ్యలు చేశారు. పాచికల్లు తాగిన ముఖాలుగా శాసన సభ్యులను టీవీ-9 అభివర్ణించింది. అంతటి అహంకారంతో వ్యవహరిస్తారా'' అని ఆయన ప్రశ్నించారు. పిట్ట బెదిరింపులకు, తప్పుడు ప్రచారాలకు ఎవ్వరూ భయపడరని కేసీఆర్ అన్నారు. గౌరవ శాసనసభ్యులకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడానికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. తమిళనాడులో జయలలితలాగా అవసరం అయితే కేబుల్ చట్టాలను అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు.