సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలకు తరలించినా అక్కడ ఉండేందుకు వారు నిరాకరిస్తున్నారు. వసతులు లేవని, భోజనం సరిగ్గా లేదని, ఒంటరిగా ఉండలేకపోతున్నామని సాకులు చూపుతూ ఇంటిబాట పడుతున్నారు. తమ ఇళ్లలో అనేక వసతులున్నాయని, ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటామని చెబుతూ వెళ్లిపోతున్నారు. అయితే వారిని ఒప్పించడంలో, వసతులు కల్పించడంలో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విఫలం అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం నాటికి ఏడు క్వారంటైన్ కేంద్రాల నుంచి ఏకంగా 1,019 మంది వెళ్లిపోయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే వారి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
ముందు జాగ్రత్తగా తరలించినా...
చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ సహా నాలుగు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు కరోనా వైరస్ లక్షణాలు లేకపోయినా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది. ఇతర దేశాల నుంచి వచ్చేవారు ఎవరైనా ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్వారంటైన్ కేంద్రాల్లో ఎవరికైనా వైరస్ లక్షణాలుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలకు తరలిస్తోంది. అయితే ఈ విషయంలో మొదట కఠినంగా వ్యవహరించిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు... చివరకు వసతులు కల్పించలేకపోతున్నామన్న భావనతో చేతులెత్తేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
వారిని క్వారంటైన్ సెంటర్ల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్, పాస్‌పోర్టులు తీసుకొని పంపిస్తున్నారు. ఆయా దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులందరినీ 14 రోజులపాటు వికారాబాద్‌లోని హరిత రిసార్ట్, దూలపల్లి ఫారెస్టు అకాడమీ లాంటి ఏడు చోట్ల ఉంచారు. అయితే ఆయా దేశాల నుంచి వచ్చిన వారిలో వీఐపీలు ఉండటం, సర్కారు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారందరినీ ఇళ్లకు పంపేశారు. అయితే ఇలా అత్యధిక వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచకుండా పంపిస్తే ఎలాగన్న దానిపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment