
శివతో పాటే.. భార్య కూడా చైన్ స్నాచర్!
పోలీసుల విచారణలో వెలుగు చూసిన కొత్తకోణం
సాక్షి, సిటీబ్యూరో: భర్త అడుగుజాడల్లోనే తాను కూడా నడవాలని ఆ భార్యమణి భావించింది. అందుకే అతడితో పాటే అన్ని విద్యలూ నేర్చుకుని రంగంలోకి దిగింది. స్వయంగా తానూ చైన్ స్నాచర్ అవతారం ఎత్తింది. అవును.. శంషాబాద్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన స్నాచర్ శివ గ్యాంగ్‌లో మహిళా స్నాచర్ కూడా ఉంది. పోలీసుల తాజా విచారణలో శివ భార్య నాగలక్ష్మి నేరుగా స్నాచింగ్‌కు పాల్పడిందని తేలింది. నార్సింగి పోలీసు కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులు నాగలక్ష్మి, జగదీష్, రాజ్‌కుమార్‌లు ఈవిషయాన్ని వెల్లడించారు. దీంతో పోలీసుల షాక్‌కు గురయ్యారు. మగవారు స్నాచింగ్‌కు పాల్పడి పారిపోవడమే కష్టం...
అలాంటిది నడిరోడ్డుపై నాగలక్ష్మి స్నాచింగ్ చేసి తప్పించుకోవడంపై పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. స్నాచింగ్‌కు పాల్పడే ముందు కేవలం రెక్కీ నిర్వహించే నాగలక్ష్మి, తాను కూడా స్వయంగా రంగంలోకి దిగి స్నాచింగ్‌కు పాల్పడిన సంఘటనలు మల్కాజిగిరి డీసీపీ జోన్ పరిధిలో మూడు వరకు ఉన్నాయి. శివ కారును నడిపించగా, వెనుక సీట్లో కూర్చున్న నాగలక్ష్మి కారు దిగి.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి మంగళసూత్రాన్ని లాక్కుని పరుగెత్తుకుంటూ వచ్చి తిరిగి కారులో కూర్చుని పారిపోయేది. భర్త శివ స్నాచింగ్‌లు చేస్తుండగా చూసిన నాగలక్ష్మి తాను కూడా చేస్తానని మారం చేయడంతో శివ అంగీకరించాడని తెలిసింది.
రెండు రోజుల క్రితం చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఈ ముగ్గురినీ విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో తిరిగి కస్టడీలోకి తీసుకోవడంతో నాగలక్ష్మి నేరాలు వెలుగు చూశాయి. ఈ గ్యాంగ్ తాకట్టు పెట్టిన బంగారాన్ని రికవరీ చేసేందుకు నార్సింగి పోలీసులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణ పూర్తి కావడంతో నేడు తిరిగి ఈ ముగ్గురిని చర్లపల్లి జైలుకు తరలిస్తారు.