- పట్టణ సమీపంలో గది అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల అనుమానం
- ఉగ్రవాదులు సంగారెడ్డి నుంచి విజయవాడకు వెళ్తూ పట్టుబడినట్లు సమాచారం
సాక్షి, సంగారెడ్డి: నల్లగొండ ఎన్‌కౌంటర్‌లో మరణించిన సిమి ఉగ్రవాదులు మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలో గది అద్దెకు తీసుకుని నివాసం ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో తేలినట్లు తెలిసింది. ఈ నెల రెండో తేదీన ఉగ్రవాదులు సంగారెడ్డి నుంచే విజయవాడకు వెళ్తూ సూర్యాపేటలో పోలీసులకు పట్టుబడినట్టు సమాచారం. ఉగ్రవాదులు అస్లాం, ఎజాజ్ ఇద్దరు కూడా రంగారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దు గ్రామంలో గది అద్దెకు తీసుకున్నట్లు పోలీసు దర్యాఫ్తులో తేలినట్లు తెలిసింది. ఈ మేరకు వారు అద్దెకు తీసుకున్న గదిని పోలీసులు రహస్యంగా పరిశీలించి, ఇంటి యజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్‌ను లూటీ చేసిన అనంతరం వాళ్లు ఇదే గదిలో ఆశ్రయం పొందినట్టు అనుమానిస్తున్నారు.
ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాది ఎజాజ్ ముత్తూట్ ఫైనాన్స్ లూటీలో ఉన్నారని పోలీసులు నిర్ధారించడం, అతని మృతదేహాన్ని బ్యాంకు సిబ్బంది కూడా గుర్తుపట్టడంతో ఉగ్రవాదులు ఇక్కడ మకాం వేశారనే ఆరోపణకు బలం చేకూరుతోంది. దీనిపై జిల్లా ఎస్పీ సుమతి వివరణ కోరగా ఉగ్రవాదులు ఇల్లు అద్దెకు తీసుకున్నారనటం నిజం కాదన్నారు.