111.. మనవే
► ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే టీఆర్‌ఎస్‌దే హవా: కేసీఆర్
► బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు.. ఎంఐఎం ఆరు స్థానాల్లో గెలుస్తుంది
► పాత నల్లగొండలో 12 స్థానాలు గెలుస్తాం.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఓడిపోతారు
► వచ్చే ఎన్నికల్లో దేశంలో మోదీ హవా ఉండదు.. మనం 16 ఎంపీ స్థానాలు గెలవాలి
► మూడోదఫా సర్వేలో నంబర్–1 స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్
► 91 శాతం మార్కులతో రెండోస్థానంలో కేటీఆర్.. 88 శాతంతో మూడోస్థానంలో హరీశ్
► పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘మండల సమ్మేళనాలు’.. జూలై నుంచి ‘పునర్విభజన’
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్‌ఎస్ 111 స్థానాల్లో గెలుస్తుంది. బీజేపీకి ఒక్కసీటు కూడా రాదు. వచ్చే ఎన్నికల్లో మోదీ హవా అంతగా ఉండదు. హైదరాబాద్‌లో ఎంఐఎం ఆరు స్థానాల్లో గెలుస్తుంది. కల్వకుర్తి, మధిర నియోజకవర్గాల్లో పార్టీ కొంత బలహీనంగా ఉంది. మంచి నాయకులు ఉంటే కల్వకుర్తి, మధిర స్థానాల్లోనూ గెలుస్తాం...’’ అని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.
పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై మూడో దఫా నిర్వహించిన సర్వే వివరాలను సీఎం ఈ సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే రెండు దఫాలుగా సర్వే చేసి, నివేదికలను నేతలకే స్వయంగా అందజేయగా, తాజా వివరాలను పాత జిల్లాలు, నియోజకవర్గాల వారీగా వివరించారు. సర్వేలో సీఎం కేసీఆర్ 98 శాతంతో మొదటిస్థానంలో నిలిచారు. మంత్రి కేటీఆర్ 91 శాతంతో రెండో స్థానం, మంత్రి హరీశ్‌రావు 88 శాతంతో మూడో స్థానం (ఇదే స్థానంలో సోమారపు సత్యనారాయణ కూడా ఉన్నారు), స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య 4వ స్థానంలో నిలిచారు.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆఖరి స్థానంలో ఉన్నారు. పార్టీ నేతలకు 91 నియోజకవర్గాల్లో 50 శాతం మార్కులు, 9 నియోజకవర్గాల్లో 80 శాతం మార్కులు వచ్చినట్లు సమాచారం. సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికపై చర్చ సందర్భంగా.. రాష్ట్రానికి, పార్టీకి ఏది మంచిదో ఆ నిర్ణయం సీఎం తీసుకోవాలని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు కోరారు.
ప్రాంతీయ పార్టీలదే హవా..
ఈసారి ఎన్నికల్లో దేశంలో ఎవరి హవా పనిచేయదని, ప్రాంతీయ పార్టీలదే హవా అని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘ఈసారి 16 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలి. మనకు కావాల్సిన వాళ్లే కేంద్రంలో అధికారంలోకి వస్తారు. సర్వే సంస్థలు ఆశ్చర్యపోయేలా ఏకపక్షంగా మనకు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. ఏ పార్టీ కూడా మన దరిదాపుల్లో లేవు. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లాలి. ప్రజా సంబంధాలు విస్తృతంగా ఉండాలి. ఎక్కడా బలహీనంగా ఉన్నామని భావిస్తే అక్కడ నేను వచ్చి తిరుగుతా. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో ప్రగతి భవన్‌కు పిలిచి మాట్లాడతా’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాను ఏ నిర్ణయమైనా దూరదృష్టితో తీసుకుంటానని, కేంద్రం తాజాగా పశువుల క్రయవిక్రయాలపై తెచ్చిన నిబంధనల వల్ల రాష్ట్రంలో గొర్లకు డిమాండ్ పెరుగుతుందని వివరించారు.
పీసీసీ చీఫ్ ఓడిపోతాడు..
పాత నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ 12 స్థానాలు గెలుచుకుంటుందని, పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఓడిపోతాడని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో యాదవులను కూడగట్టుకుంటే పార్టీ గెలుస్తుందన్నారు. 82 శాతం కంటే ఎక్కువ వచ్చిన మంత్రుల గురించి మాట్లాడిన ఆయన.. 82 శాతం కన్నా తక్కువ వచ్చిన మంత్రుల గురించి తర్వాత మాట్లాడుదామన్నారు. మరోవైపు జూలై నుంచి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ షురూ అవుతుందని తెలిపారు. ‘‘మన జోలికి వస్తే నేలకు వేసి కొడ్తం. అమిత్ షా విషయంలో ఏం జరిగింది. దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాం. మంచి స్పందన కూడా వచ్చింది’’అని సమావేశంలో సీఎం వ్యాఖ్యానించారని సమాచారం.
మండల సమ్మేళనాలు.. పథకాలపై ప్రచారం..
ప్రభుత్వం చేపడతున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని సీఎం సూచించారు. ‘‘గ్రామీణ ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేసేందుకు, ఆ ప్రయోజనాలు గ్రామీణులకు దక్కేందుకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు సాయం, ఎంబీసీలకు పథకాలు చేపడతున్నాం. ఈ పథకాలు ఎందుకు అమలు చేస్తున్నామో, దానివల్ల వారికి కలిగే ప్రయోజనం ఏంటో వివరించాలి. ఇందుకు ప్రతీ మండలంలో ‘టీఆర్‌ఎస్ మండల కుటుంబ సమ్మేళనం’జరపాలి. దీనికి ఎంపీలు, మంత్రులను ఆహ్వానించండి. మనం ఏం చేస్తున్నామో వివరించండి. వారి గ్రామాలకు ఇంకా ఏం కావాలో తెలుసుకోండి. మంజూరీలు ఇప్పించండి..’’అని సీఎం వివరించారు.
పార్టీ పరిస్థితిపైనా ఆయన సుదీర్ఘంగానే మాట్లాడారు. జిల్లాలు, నియోజకర్గాల వారీగా పార్టీ, ఎమ్మెల్యేల పనితీరుపై గణాంకాలు వివరించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలని, ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకోవాలని సూచించారు. కనీసం పదిరోజులకోసారి మంత్రులు, ఎంపీలు కూర్చుకొని సమన్వయ అంశాలు మాట్లాడుకోవాలన్నారు. మంత్రులు కచ్చితంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. మంత్రులు తమ నిధులను ఎమ్మెల్యేలకు పంచాలన్నారు. పార్టీ సభ్యత్వాల సీడీలను రెండు మూడ్రోజుల్లో అప్పగించాలన్నారు. ‘‘రైతులు నూరు శాతం మనకు మద్దతుగా ఉన్నారు. బీసీలు 99 శాతం మన వైపు ఉంటారు. వారి అభిమానాన్ని నిలబెట్టుకోవాలి..’’అని సీఎం అన్నారు.
సీఎంకు పెరిగిన భద్రత
సీఎం కేసీఆర్‌కు అసాధారణ భద్రత కల్పించారు. తెలంగాణ భవన్‌లో కార్యక్రమానికి హాజరైన సీఎంకు గ్రేహౌండ్స్ బలగాలు భద్రతగా వచ్చాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ హెచ్చరికలున్న నేపథ్యంలోనే సీఎం భద్రత పెంచారని భావిస్తున్నారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 10 మంది, గతంలో గ్రేహౌండ్స్‌లో పనిచేసిన మరో ఎనిమిది మంది మొత్తం 18 మందిని ఏర్పాటు చేసినట్టు సమాచారం. కాగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆధీనంలోని సీఎం సెక్యూరిటీ గ్రూప్‌కు చెందిన మరో 16 మంది మొత్తంగా 34 మందిని సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నారని చెబుతున్నారు.
టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు లెదర్ బ్యాగులను గిఫ్ట్‌గా పంపిణీ చేశారు. తొలిసారి సమావేశంలోకి ఫోన్లు అనుమతించలేదు. మొదట సమావేశ మందిరంలోకి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులంతా తిరిగి బయటకి వచ్చి తమ ఫోన్లను వ్యక్తిగత సిబ్బందికి అప్పగించి వెళ్లారు. సమావేశం ముగించుకుని వెళ్తున్న సీఎంకు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు ప్లకార్డులతో నిరసన తెలపగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.