వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 101-106 సీట్లు
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో 153(నియోకవర్గాల పునర్విభజన జరిగితే ఉండే సీట్లు) అసెంబ్లీ స్థానాలకుగానూ టీఆర్‌ఎస్ పార్టీకి 101-106 సీట్లు వస్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా సర్వే వివరాలను ఆయన వెల్లడించారు.
అలాగే ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని ఆదేశించారు. సమావేశాలకు వచ్చే ముందు అన్ని అంశాలపై అవగాహనతో రావాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు సూచించారు. అలాగే మంత్రులు అరగంట ముందే అసెంబ్లీకి చేరుకోవాలని సీఎం పేర్కొన్నారు.
కాగా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారని.. ఆ సర్వే ప్రకారం సగానికి పైగా ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు తేలిందని టీఆర్‌ఎస్ పార్టీలో పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో 2019 ఎన్నికల్లో ఈ సర్వే ఆధారంగానే కేసీఆర్ టికెట్లు ఇస్తారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్వే వివరాలు వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.