తెలంగాణ రాష్ట్రంలో మూడో పోలీసు కమిషనరేట్ ఏర్పాటైంది. వరంగల్ నగర పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడో పోలీసు కమిషనరేట్ ఏర్పాటైంది. వరంగల్ నగర పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదివారం తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన మూడో పోలీసు కమిషనరేట్ ఇదే.
హైదరాబాద్ మహానగరం తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం కేసీఆర్ ఇటీవల వరంగల్ నగరంలో పర్యటించి అక్కడ పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కమిషనరేట్ ఏర్పాటుతో వరంగల్ నగర పోలీసు విభాగం ప్రత్యేక యూనిట్‌గా ఏర్పాటు కానుంది.
త్వరలో ఐజీ లేదా డీఐజీ స్థాయి అధికారిని వరంగల్ పోలీసు కమిషనర్‌గా ప్రభుత్వం నియమించే అవకాశముంది. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసు కమిషనర్‌కు మెజిస్టీరియల్ అధికారులు ఉంటాయి. పట్టణ పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసే నిధులు సైతం ఇకపై వరంగల్ కమిషనరేట్‌కు రానున్నాయి.