కిరాతకులకే కిరాతకుడు కిమ్
- ఇప్పటివరకు 340 మందికి మరణదండన
- కుటుంబసభ్యుల ముందే బాధితులకు దారుణ శిక్షలు
- ఉత్తరకొరియా నియంత నేత రక్తదాహంపై తాజా రిపోర్టు
సియోల్: శత్రుదేశ విమానాలను నేలకూల్చే యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్‌తో సోంత మంత్రులను కాల్చిపారేశాడు. కుటుంబసభ్యుల ముందే ఆ మంత్రి శరీరం ముక్కలుముక్కలైపోయే దృశ్యాలను చూస్తూ అతడు వికృతంగా నవ్వాడు. మరో సందర్భంలో ఇంకో మంత్రిని సైనికుల చేత కాల్పించాడు. మంత్రులైతేనేమి, అధికారులు, ఉద్యోగులు, సాధారణ పౌరులైతేనేమి ఇప్పటివరకు 340 మందికి మరణదండన విధించాడు ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్.
కిమ్‌ను కిరాతకులకే కిరాతకుడిగా అభివర్ణిస్తూ దక్షిణకొరియాకు చెందిన ఓ అధ్యయన సంస్థ అతడి అకృత్యాలపై మంగళవారం ఒక నివేదికను విడుదలచేసింది. తండ్రి కిమ్ జాంగ్-2 మరణానంతరం 2011లో పదవీబాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2016 చివరి వరకు కిమ్ జాంగ్ ఉన్ కనీసం 340 మందికి మరణదండన విధించాడని, శిక్షకు గురైనవారిలో 140 మంది ప్రభుత్వాధికారులేనని పొరుగుదేశం దక్షిణకొరియాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ సంస్థ పేర్కొంది.
దేశాధినేతగా కిమ్ జాంగ్ ఉన్ నియమితుడైన నాటి నుంచి ఐదుసార్లు రక్షణశాఖ మంత్రిని మార్చేశారని, అదే కిమ్ జాంగ్-2 మాత్రం తన 17 ఏళ్ల పదవీకాలంలో కేవలం మూడుసార్లే రక్షణ మంత్రిని మార్చారని, అదికూడా వారు వయోభారంతో కన్నమూసిన సందర్భాల్లోనే జరిగిందని, తద్వారా జాంగ్ ఉన్‌లోని అభద్రతాభావం తేటతెల్లం అవుతుందని అధ్యయన సంస్థ పేర్కొంది.
ఇదిలా ఉండగా కొత్త సంవత్సరానికి మరో అణ్వాయుధ పరీక్షతో స్వాగతం పలుకుతామని కిమ్ జాంగ్ సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే పలుమార్లు అణ్వాయుధ, క్షిపణి ప్రయోగాలు చేపట్టిన ఉత్తరకొరియా ప్రపంచ దేశాల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.