ఫేస్‌బుక్, వాట్సప్, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా యువతులను పరిచయం చేసుకుని పెళ్లాడతానని నమ్మించి..
► సోషల్ మీడియా, వివాహ వెబ్‌సైట్లలో ఘనంగా ప్రొఫైల్స్
► బెంగళూరులో ఘరానా మోసగాని అరెస్టు
బనశంకరి (బెంగళూరు): ఫేస్‌బుక్, వాట్సప్, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా యువతులను పరిచయం చేసుకుని పెళ్లాడతానని నమ్మించి వారినుంచి అందినంత డబ్బు, నగలు దోచుకుంటున్న ఘరానా వంచకుని పాపం పండి పట్టుబడ్డాడు. పలువురిని శారీరకంగా కూడా మోసగించాడు. బెంగళూరులోని బాగలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హాసన్ నగరానికి చెందిన సాదత్‌ఖాన్ అలియాస్ ప్రీతమ్‌కుమార్ అనే వంచకుడు చేసిన మోసాల చిట్టా విని పోలీసులే తెల్లబోయారు. పదుల సంఖ్యలో అమ్మాయిల్ని పరిచయం చేసుకుని అన్ని విధాలుగా దోచుకోవడంలో ఇతడు సిద్ధహస్తుడు.
వివరాల్లోకి వెళ్తే... హాసన్‌లో ఐటిఐ వరకు చదివి ఆటోడ్రైవర్ అయ్యాడు. మద్యానికి బానిస కావడంతో తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. 2011లో బెంగళూరుకు చేని సాదత్‌ఖాన్ యశవంతపురలోని ఒక వెల్డింగ్‌షాప్‌లో పనికి చేరాడు. కొద్దిరోజులు పనిచేసి వదిలిపెట్టి కోరమంగలలో ఉన్న కంట్రీక్లబ్‌లో టెలికాలర్‌గా ఉద్యోగం సంపాదించాడు. కొంతకాలానికే దానినీ వదిలేశాడు. కెంపాపురలో సిస్కో, ఎంజీ.రోడ్డులో ఉన్న హాలెక్స్ కంపెనీల్లోనూ టెలికాలర్‌గా పనిచేశాడు. అమ్మాయిలను వేధిస్తున్నాడన్న ఆరోపణలు రావడంతో ఇతన్ని ఆ కంపెనీలు పనిలో నుంచి తీసేశాయి.
నమ్మించి.. నట్టేట
అనంతరం ఫేస్‌బుక్, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో రాహుల్, కార్తీక్, మహమ్మద్‌ఖాన్, ప్రీతమ్‌కుమార్, సాదత్‌ఖాన్ తదితర పేర్లతో ప్రొఫైల్స్ పెట్టుకుని తాను సాప్ట్‌వేర్ ఇంజనీర్, ప్రభుత్వ అధికారి, ప్రైవేటు కంపెనీల సీఈవోనంటూ సూటుబూటులో ఫోటోలు పెట్టి యువతులను, మహిళలను ఆకర్షించడం ఆరంభించాడు. ఇతనితో పరిచయం చేసుకున్న అమాయక యువతులను పెళ్లాడతానని నమ్మించి భారీమొత్తాల్లో డబ్బు గుంజేవాడు. ఒకరి నుంచి లాక్కున్న డబ్బును మరో యువతి వద్ద విలాసాల కోసం వినియోగించేవాడు. స్టార్ హోటళ్లలో బస చేస్తూ కార్లలో షికార్లు కొట్టేవాడు. ఈ ఆరేళ్ల కాలంలో ఇలా సుమారు వందమందికిపైగా యువతులను మోసగించగా, కొందరు బాధితులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కేసులే
ప్రీతంకుమార్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బు తీసుకుని మోసగించాలని జూన్ 21 తేదీన ఓ మహిళ బాగలూరు పోలీస్‌స్టేషన్‌లో మొరపెట్టుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హాసన్‌లో ఉన్నట్లు గుర్తించి మంగళవారం ఉదయం చాకచక్యంగా అరెస్టు చేశారు. ఇతనిపై యలహంక, విద్యారణ్యపుర, కేఆర్.పుర, జయనగర, హెబ్బగోడి. దొడ్డబళ్లాపుర, మైసూరు, ధారవాడ పోలీస్‌స్టేషన్లలో ఇటువంటి కేసులే నమోదై ఉన్నాయి. మైసూరులోని కేఆర్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసులో అరెస్టై జైలుకెళ్లి గత నెలలో విడుదలయ్యాడు.
వచ్చీ రాగానే బాగలూరు పరిధిలోని యువతిని మాయమాటలతో లోబర్చుకున్నాడు. తుమకూరు, మైసూరు, దొడ్డబళ్లాపుర, హుబ్లీ, ధార్వాడ, బెంగళూరుల్లో అమ్మాయిలను మోసగించి రూ.45 లక్షలకు స్వాహా చేసినట్లు పోలీసులు తెలిపారు. యలహంక పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ప్రకారం ఒక మహిళను శారీరకంగా వాడుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. ఇతని బాధితుల సంఖ్య క్రమంగా పెరగవచ్చని పోలీసులు చెబుతున్నారు.