Published
Tue, Feb 14 2017 11:46 AM
| Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు
చెన్నై : శశికళ సీఎం పదవి ఆశలను అడియాసలు చేస్తూ సుప్రీంకోర్టు ఆమెను ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారించింది. తీర్పు వెలువడిన వెంటనే ఎమ్మెల్యేలున్న గోల్డెన్ బే రిసార్ట్లోకి కమాండోలు వెళ్లారు. రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలను బయటికి తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటు చేసిన అనంతరం నుంచి గత వారం రోజులుగా ఎమ్మెల్యేలందర్ని శశికళ గోల్డెన్ బే రిసార్ట్లోనే ఉంచారు. వారిని ఎవరితో కలవనియ్యకుండా, వారి ఫోన్లను కూడా తీసేసుకున్నారు. శశికళ వర్గంపై అసంతృప్తి ఏర్పడినా కొందరు ఎమ్మెల్యేలను ఆమెనే స్వయంగా వెళ్లి బుచ్చగించారు. చాలామంది ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి బయటికి వచ్చేయాలని భావించిన వారిని అక్కడే నిర్భందంగా వచ్చినట్టు తెలిసింది.
సుప్రీం తీర్పు నేడు వెలువడనున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి ఆమె కూడా గోల్డెన్ బే రిసార్ట్లోనే ఉన్నారు. తీర్పు తనకు అనుకూలంగా వస్తే, అక్కడి నుంచి విజయోత్సవ క్యాంప్ కూడా చేయాలని శశికళ ప్లాన్ చేశారు. అయితే ఆమె ఆశలపై సుప్రీం నీళ్లు చల్లింది. 1990లో ఆదాయానికి మించిన ఆస్తులను శశికళ కలిగి ఉందని ఆమెను దోషిగా నిర్ధారించింది. మరోవైపు నేడు సుప్రీం తీర్పు నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశముందని చెన్నై వ్యాప్తంగా 15వేల మంది పోలీసులను భద్రతకు దించారు. వీరిని గోల్డెన్ బే రిసార్ట్ సమీపంలో, రాష్ట్ర సచివాలయం, పోయెస్ గార్డు సమీపంలో భద్రతా ఏర్పాట్లను వారు పర్యవేక్షిస్తున్నారు. తీర్పు అనంతరం గోల్డెన్ బే రిసార్ట్లో భారీగా పోలీసులు మోహరించారు. వెంటనే లొంగిపోవాలని తీర్పు వెలువరిచిన నేపథ్యంలో శశికళను మరికొద్దిసేపట్లో అరెస్టు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.