మా ఆవిడ మిస్సింగ్..!
మా ఆవిడ మిస్సింగ్..!
Published Fri, Feb 10 2017 8:43 AM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM
''ఏరికోరి ఎమ్మెల్యేను పెళ్లి చేసుకున్నా.. ఇప్పుడు నా భార్య మిస్సింగ్'' అంటూ ఓ భర్త చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనే కాదు.. దాదాపు 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులందరిదీ ఇదే బాధ. తమవాళ్లు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు.. వాళ్లకు సమయానికి మందులు అందుతున్నాయో లోదేనన్న ఆందోళన కుటుంబ సభ్యులలో వ్యక్తమవుతోంది. పోనీ ఫోన్ చేసి కనుక్కుందామంటే ఫోన్లన్నీ స్విచాఫ్ లేదా కాల్ డైవర్ట్ అని వస్తున్నాయి. రెండు రోజుల క్రితం అందరినీ మూడు ఏసీ బస్సుల్లో చెన్నై నుంచి తరలించి ఎక్కడెక్కడో దాచిపెట్టేశారు. వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రాజభోగాలు అన్నీ అందిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. వాటర్ స్కీయింగ్, డీప్ టిష్యూ మసాజ్.. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయంటున్నారు.
అయితే, ఇప్పుడు ఆ క్యాంపు నుంచి కూడా కొంతమంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు.. ఎవరెన్ని చెప్పినా తాము మాత్రం పన్నీర్ సెల్వానికే మద్దతుగా ఉంటామని చెప్పి క్యాంపుల నుంచి తప్పించుకున్నారని అంటున్నారు. వాళ్లేమయ్యారో కూడా ఇంకా ఆచూకీ తెలియలేదు. వాళ్లు తనకు టచ్‌లో ఉన్నారని పన్నీర్ సెల్వం చెబుతున్నారు గానీ, ఎక్కడున్న విషయం మాత్రం తెలియట్లేదు. మన్నార్‌గుడి మాఫియా బారి నుంచి తప్పించుకోడానికే వాళ్లంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ఎమ్మెల్యేలను అక్రమంగా నిర్బంధించారంటూ మద్రాస్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి గానీ, ఎమ్మెల్యేలు సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతోప ఆ పిటిషన్లను కొట్టేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు హాస్టల్లోనే ఉన్నారని శశికళ వర్గీయులు చెప్పినా, అక్కడకువెళ్లి చూసినవారికి ఖాళీ గదులే దర్శనమిచ్చాయి తప్ప ఎమ్మెల్యేలు ఎవరూ లేరు.
'కాల్ యువర్ ఎమ్మెల్యే' పేరుతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సోషల్ మీడియాలో ప్రయత్నాలు జరిగాయి. మొత్తం ఎమ్మెల్యేలందరి ఫోన్ నంబర్లు తదితర వివరాలతో కూడిన జాబితాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే, తాను దాదాపు ప్రతి ఎమ్మెల్యే నంబరుకు ఫోన్ చేసి చూశానని, అన్నీ అయితే స్విచాఫ్ లేదా కాల్ డైవర్ట్ వస్తున్నాయని శ్రీమతి మోహన్ అనే ఐటీ ఉద్యోగి చెప్పారు. దీన్ని బట్టి చూస్తే మొత్తం అందరి ఫోన్లు శశికళ వర్గం చేతుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనాలు చదవండి..
Advertisement
Advertisement