మా పార్టీని సర్వనాశనం చేస్తున్నది ఆయనే!
లక్నో: ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సన్నిహితుడు, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బహిష్కృత నేత ఉదయ్‌వీర్ సింగ్ పార్టీ సీనియర్ నేత అమర్‌సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు ములాయం కుటంబంలో చిచ్చు రాజుకోవడానికి కారణం అమర్‌సింగేనని, బీజేపీతో కుమ్మక్కయి.. సమాజ్ వాదీ పార్టీని దెబ్బతీయడానికి ఆయన కుట్ర పన్నారని ఆరోపించారు.
'పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ నాయకత్వంలో అమర్ సింగ్ చేసిన కుట్ర ఇది. కుటుంబ విలువలు, అంతర్గత ఈర్ష్యద్వేషాల సాకుతో అఖిలేశ్ యాదవ్‌ను బలహీనుడిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన మరోసారి అధికారంలోకి రాకుండా ఈ కుట్ర పన్నారు' అని ఆయన సీఎన్‌ఎన్ న్యూస్18తో అన్నారు.
ఎస్పీలో మళ్లీ చేరినప్పటికీ అమర్‌సింగ్ ఇంకా బీజేపీ నేతలను కలుస్తున్నారని, బీజేపీ నేతలు, వ్యక్తులు ఇచ్చే పార్టీలకు ఆయన హాజరవుతున్నారని పేర్కొన్నారు. పార్టీ అధినేత ములాయంను తప్పుదోవ పట్టించి.. పార్టీని భ్రష్టు పట్టించేందుకు ముందస్తు కుట్రతో అమర్‌సింగ్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అఖిలేశ్‌కు అత్యంత సన్నిహితుడైన ఉదయ్‌వీర్ సింగ్‌ను అధినేత ములాయం పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయనను కొడుకు అఖిలేశ్ చేరదీసి రాజకీయ ఆశ్రయం కల్పించడం ములాయంకు నచ్చలేదని తెలుస్తోంది. అతని బహిష్కరణతో బాబాయి శివ్‌పాల్ యాదవ్, సీఎం అఖిలేశ్ మధ్య తీవ్రస్థాయిలో జరుగుతున్న అంతర్గత వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఇరువర్గాలు తాడోపెడో తేల్చుకునేందుకు సిద్ధపడుతుండటంతో ఎస్పీలో చీలిక వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.