ములాయం-అఖిలేష్ వివాదంలో మరో ట్విస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం టీ కప్పులో తుఫానులా సమసిపోయింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాంగోపాల్ యాదవ్‌లపై విధించిన సస్పెన్షన్‌ను ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఉపసంహరించుకోవడం, త్వరలో జరిగే ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పనిచేస్తామని ములాయం కుటుంబం ప్రకటించడంతో వివాదం ముగిసింది. అయితే ఎస్పీలో తెరవెనుక నాటకీయ పరిమాణాలు చోటు చేసుకున్నాయి.
టికెట్ల కేటాయింపు వ్యవహారంలో తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ యాదవ్‌లతో విభేదాలు ఏర్పడిన తర్వాత అఖిలేష్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఎస్పీలో చాలామంది ఎమ్మెల్యేలు అఖిలేష్‌కు మద్దతుగా నిలిచారు. అఖిలేష్ కొత్త పార్టీ స్థాపించబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు కూడా ఆయన ప్రయత్నించారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీతో అఖిలేష్ సమావేశమై ఈ విషయంపై చర్చించినట్టు సమాచారం. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్తో కలసి పనిచేసేందుకు కాంగ్రెస్ కూడా సుముఖంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఎస్పీలో సంక్షోభం ఏర్పడ్డాక జాతీయ స్థాయి నేతలు సైతం అఖిలేష్కు మద్దతుగా నిలిచారు. ఇంతలో అజాంఖాన్ జోక్యంతో ములాయం, అఖిలేష్ మధ్య వివాదం సమసిపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తుపెట్టుకుందా లేదా అన్నది వేచి చూడాలి.