‘నోట్ల రద్దు’ కేసులపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా నెలకొన్న గందరగోళ పరిస్థితిపై దాఖలైన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. నోట్ల రద్దు, కొత్త కరెన్సీ పంపిణీ తీరును ఆక్షేపిస్తూ దేశంలోని పలు కోర్టుల్లో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో వాటన్నింటినీ ఒకే కోర్టులో విచారించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది.
ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను(మొత్తం కరెన్సీలో 80 శాతాన్ని) ఒకేసారి రద్దుచేయడం తగదని, రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కొందరు పిటిషనర్లు కోరగా, బ్యాంకుల ముందు క్యూ లైన్లలో చనిపోయినవారి తరఫున మరికొందరు పిటిషన్లు దాఖలుచేశారు. కాగా, నోట్ల రద్దు(డీమానిటైజేషన్)పై దాఖలైన అన్నిపిటిషన్లను కొట్టేయాలని గతవారం కేంద్ర ప్రభుత్వం దాఖలుచేసిన వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
పిటిషన్లు అన్నింటినీ బుధవారం (నవంబర్ 23న) సుప్రీంకోర్టులోగానీ, ఏదేనీ హైకోర్టులో గానీ విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు కేసుల బదలాయింపుకు సంబంధించిన పిటిషన్ ను కేంద్ర అటార్నీ జనరల్ చేతే దాఖలు చేయించింది. ఏజీ రోహత్గీ.. ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ను కలిసిన సంబంధిత పిటిషన్లను అందజేశారు. (పరిస్థితి ఆందోళనకరం..అల్లర్లకు దారితీయొచ్చు..)