చెన్నైలో హై టెన్షన్
రాష్ట్రంలో 144 సెక్షన్ అమలుకు పరిశీలన
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో నరాలు తెగే ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ, ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం వర్గీయుల మధ్య పెరుగుతున్న మాటల దాడి, పరస్పరం ఫిర్యాదులు, బెదిరింపు ల పర్వం ఉత్కంఠభరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించే విధంగా శశికళ వ్యాఖ్యల తూటాలు, పన్నీరుకు మద్దతుగా ఎమ్మె ల్యేలపై ఒత్తిడికి ఓటర్లు సిద్ధం కావడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ 14వ తేదీ శశికళకు వ్యతిరేకంగా ఏదేని తీర్పు వెలువడ్డ పక్షంలో ఆ వర్గీయులు వీరంగాలకు దిగే చాన్స్ ఉందన్న సమాచారంతో అధికార వర్గాలు ముం దస్తు చర్యలు చేపడుతున్నాయి. రాజ్‌భవన్ పరిసరాల్ని భద్రతా వలయంలోకి తెచ్చారు.
ఇక రాష్ట్రంలో 144 సెక్షన్ అమలుకు తగ్గ కసరత్తులపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ అధికా రులను అప్రమత్తం చేస్తూ సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. నగరంలో వాహ నాల తనిఖీలు విస్తృతం చేయాలని అందులో పేర్కొన్నారు. లాడ్జీలు, మ్యాన్ షన్లు, సర్వీస్ అపార్టుమెంట్లు, కల్యాణ మండపాలు తదితర వాటిని బయట వ్యక్తులకు ఇవ్వరాదని ఆంక్షలు విధించా రు. నగర శివారులు, ప్రధాన మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.