చీలిక దిశగా అన్నాడీఎంకే!
తమిళనాడులోనే అతిపెద్ద పార్టీలలో ఒకటైన అన్నాడీఎంకే.. మరోసారి చీలిక దిశగా వెళ్తోంది. 1972లో ఎంజీ రామచంద్రన్ స్థాపించిన ఈ పార్టీని ఆయన తర్వాత దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు జయలలిత ఏకఛత్రాధిపత్యంగా నడిపించారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ మరోసారి చీలిపోయేందుకు సిద్ధంగా కనిపిస్తోంది. తనకు సుప్రీంకోర్టు జైలుశిక్ష విధించిన తర్వాత.. పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడి పళనిసామిని శశికళ ప్రతిపాదించారు.
ఇది నిజానికి పార్టీలో చాలామందికి మింగుడుపడట్లేదని తెలుస్తోంది. ఇప్పటికే పళనిసామిపై అవినీతి ఆరోపణలున్నాయని, అందువల్ల అలాంటి వ్యక్తి కంటే.. అమ్మకు విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వం అయితేనే మేలని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. దాంతో శశికళ బెంగళూరు బయల్దేరి వెళ్లిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతు విషయంలో పునరాలోచన చేసుకుంటారని.. అప్పుడే ఎవరి వెంట ఎంతమంది ఉన్నారన్నది కచ్చితంగా తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే మరోవైపు ఇప్పటికే తమిళనాడులో బేరసారాలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. మద్దతివ్వాలంటే ఎంత ఇస్తారంటూ కొందరు ఎమ్మెల్యేలు బేరాలకు దిగుతున్నట్లు సమాచారం.
ఇక పార్టీపై పట్టు విషయంలో కూడా రెండు వర్గాలుగా నేతలు చీలిపోయారు. ఎలాగైనా తన కుటుంబ సభ్యులందరినీ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్లను అగ్రస్థానాల్లో కూర్చోబెట్టాలని శశికళ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తీవ్ర ఆర్థిక ఆరోపణలున్న తన మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఇదే దినకరన్‌ను ఇంతకుముందు జయలలిత పోయెస్ గార్డెన్‌తో పాటు పార్టీ నుంచి కూడా తరిమేశారు. అయితే ఇప్పుడు తన వాళ్లందరినీ తీసుకురావడం ద్వారా పార్టీపై తన పట్టు బిగించాలని శశికళ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న మధుసూదనన్, మైత్రేయన్, పాండియన్, పాండియరాజన్ తదితరులు మాత్రం ఈ పరిణామాలను జీర్ణించుకోలేక.. పన్నీర్ సెల్వం శిబిరం వైపు వచ్చేస్తున్నారు.
దాంతో పార్టీలో స్పష్టమైన చీలిక ఇప్పటికే కనిపిస్తోంది. అసెంబ్లీలో బలపరీక్ష తర్వాత ఇది పూర్తిస్థాయిలో బయటపడుతుందని, అప్పటికి శశికళ వర్గం లో ఎంతమంది ఉన్నారు, పన్నీర్ వర్గంలో ఎంతమంది ఉన్నారన్న విషయం తేలిపోతుందని.. అప్పుడే ఇక పార్టీ గుర్తు, అధికారిక గుర్తింపు లాంటి అంశాలపై ఈసీ వరకు పోరాటం వెళ్తుందని భావిస్తున్నారు. అయితే.. ఇలాంటి పరిణామాల వల్ల రాబోయే ఎన్నికల్లో డీఎంకే ఎక్కువ లబ్ధిపొందే అవకాశం కూడా లేకపోలేదు. ఇన్నాళ్లూ ఒక్కటిగా ఉన్న పార్టీలో చీలిక వస్తే.. ఓట్లు కూడా చీలుతాయని, అది డీఎంకేకు తప్పనిసరిగా అనుకూలాంశం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి..