పిల్లాడి పుట్టినరోజు డబ్బుల కోసం వెళ్లి...
ఏటీఎంకు ఎందుకోసం వెళ్తాం? డబ్బులు తెచ్చుకోడానికే కదా.. అలాగే బెంగళూరు మహిళ కూడా తన పిల్లాడి పుట్టినరోజు జరిపేందుకు కావల్సిన డబ్బులు తెచ్చుకోడానికని ఏటీఎం సెంటర్కు వెళ్లింది. అక్కడ దుండగుడి బారిన పడి తీవ్రంగా గాయపడి ఐసీయూలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, ఈ కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర తెలిపారు. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు కూడా పోలీసు బృందాలు వెళ్లాయి. బాధితురాలు జ్యోతి ఉదయకుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగాను, ఫుటేజ్ ఆధారంగాను అతడిని పట్టుకోగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కార్పొరేషన్ బ్యాంకు వైపు నుంచి తీవ్రమైన భద్రతాలోపాలు ఉన్నాయని, నగరం నడిబొడ్డున ఉన్న ఏటీఎంలో కూడా గార్డులు లేకపోవడం దారుణమని కమిషనర్ అన్నారు. బ్యాంకులన్నీ తప్పనిసరిగా తమ ఏటీఎంలు, శాఖల వద్ద భద్రతను పరిరక్షించుకోవాలని రాఘవేంద్ర తెరలిపారు.
ఇదే అంశంపై కర్ణాటక హోం మంత్రి కేజే జార్జి రెండు గంటల పాటు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీప లాల్రోఖుమా పచావు, రాఘవేంద్ర ఔరాద్కర్, ఇతరులు పాల్గొన్నారు. కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని, జ్యోతి విషయంలో జరిగింది చాలా దురదృష్టకరం, దిగ్భ్రాంతికరమని జార్జి అన్నారు. నిందితుడిని ఎదుర్కోవడంలో బాధితురాలు చూపించిన ధైర్యానికి ఆమెను ప్రశంసించారు.
స్వయంగా బ్యాంకు మేనేజర్ అయిన 44 ఏళ్ల జ్యోతి.. దాదాపు మూడు గంటల పాటు రక్తపు మడుగులోనే ఏటీఎం సెంటర్లో పడి ఉన్నారు. నిందితుడు ఆమె వద్ద ఉన్న రూ. 2,500 నగదు, మొబైల్ ఫోన్ లాక్కుని వెళ్లిపోయాడు. జ్యోతి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుండగానే అతడు లోనికి వెళ్లి, షట్టర్ను లోపలి నుంచి కిందకి దించేసినట్లు వీడియో ఫుటేజిలో స్పష్టమైంది. అతడి వద్ద నాటు తుపాకి ఒకటి ఉందని, దాంతోపాటు కత్తి కూడా తీశాడని డిప్యూటీ కమిషనర్ డీసీ రాజప్ప తెలిపారు. తప్పించుకోడానికి ప్రయత్నించగా, ఓ మూలకు నెట్టేసి, ముఖంమీద కొట్టి, బ్యాగు లాక్కుని బయటకు పోతూ మళ్లీ బయటనుంచి షట్టర్ కిందకు దించేశాడన్నారు.
నిందితుడి చేతుల్లో తీవ్రంగా గాయపడిన బాధితురాలు పక్షవాతానికి గురైంది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమెకు సుదీర్ఘ శస్త్రచికిత్స చేశామని, ఆమె ప్రస్తుతం మాట్లాడగలుగుతున్నారని శస్త్రచికిత్స చేసిన బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఎన్కే వెంటకరమణ తెలిపారు. ఆమె కపాలం పగిలిందని, చిన్న ఎముకముక్క మెదడులోకి వెళ్లడంతో కుడివైపు పక్షవాతం వచ్చిందని వివరించారు.
నిందితుడి వివరాలు తెలిస్తే తెలియజేయాల్సిన ఫోన్ నెంబరు: సిల్వర్ జూబ్లీ పార్కు పోలీసు స్టేషన్ - 080- 22942583