మాల్యాను రప్పించడం చాలా కష్టం
- కేంద్ర మంత్రి వీకే సింగ్
భువనేశ్వర్: ఎగవేతదారుడు, కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాను ఉద్దేశించి విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పారిపోయి బ్రిటన్‌లో ఆశ్రయం పోందుతున్న మాల్యాను భారత్‌కు తీసుకురావడం చాలా కష్టమని సింగ్ అన్నారు.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం భువనేశ్వర్(ఒడిశా)కు వచ్చిన వీకే సింగ్ మీడియాతో మాట్లాడారు. సరిగ్గా మాల్యా అప్పగింత కేసు విచారణ ప్రారంభమైన రోజే విదేశాంగ మంత్రి ఇలా మాట్లాడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
‘బ్రిటన్‌తో మనకున్న ఒప్పందాల ప్రకారం మాల్యాను అప్పగించాల్సిందే. కానీ ఆ పని అంత సులువుగా జరిగేదికాదు. అయినాసరే మేం ప్రయత్నిస్తున్నాం’ అని మంత్రి వీకే సింగ్ చెప్పారు. ‘ఎంత గడువులోగా మాల్యాను ఇండియాకు రప్పిస్తారు?’ అన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేశారు. నేరస్తుల అప్పగింత ప్రక్రియకు గడువు ఉండదని, నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటామని సింగ్ అన్నారు.
800 పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు
దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ, మధ్యతరహా నగరాల్లోని 800 పోస్ట్‌ఆఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు అందించాలన్నది తమ లక్ష్యమని మంత్రి వీకే సింగ్ చెప్పారు. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి 150 పోస్టాఫీసుల్లో సేవలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆధార్ కార్డుల జారీ, సమాచార మార్పులను కూడా పోస్టాఫీసుల్లో చేపడుతున్నామన్నారు.