23 ఏళ్లకే.. రూ. 500 కోట్లు కొట్టేశాడు! | call centre scamster, who enmassed 500 crores is just 23, says police | Sakshi
Sakshi News home page

23 ఏళ్లకే.. రూ. 500 కోట్లు కొట్టేశాడు!

Published Mon, Oct 10 2016 1:13 PM | Last Updated on Tue, Aug 14 2018 3:18 PM

23 ఏళ్లకే.. రూ. 500 కోట్లు కొట్టేశాడు! - Sakshi

23 ఏళ్లకే.. రూ. 500 కోట్లు కొట్టేశాడు!

అమెరికాలో కొంతమంది ఏజెంట్లను నియమించుకుని.. అక్కడ ఎవరెవరు పన్నులు ఎగ్గొడుతున్నారో జాబితా సేకరించి.. వాళ్లను బెదిరించడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఏడు అంతస్థుల భవనంలో ఒక కాల్‌సెంటర్ నియమించి అతి తక్కువ కాలంలోనే 500 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇంత చేసిన వ్యక్తి వయసు ఎంతో తెలుసా.. కేవలం 23 ఏళ్లు. అతడిపేరు షాగర్ ఠక్కర్.. అలియాస్ షాగీ. స్కాం బయటపడి ఇప్పటికే వారం రోజులు దాటినా ఈ కేసులో కీలక సూత్రధారి, పాత్రధారి అయిన షాగీ, అతడి సన్నిహిత మిత్రుడు తపష్ ఇప్పటివరకు దొరకలేదు. చాలా తక్కువ వయసులోనే అయినా ఠక్కర్ చాలా పెద్దమొత్తంలో వెనకేశాడని.. అది కూడా చాలా తక్కువ సమయంలోనే సంపాదించాడని కేసును దర్యాప్తు చేస్తున్న ఒక పోలీసు అధికారి తెలిపారు. భారతదేశంలోనే కూర్చుని ఎక్కడో అమెరికాలో ఉన్న ఆ దేశ పౌరులను దోచుకోవడం అంటే చిన్న విషయం కాదని ఆయన చెప్పారు. బహుశా అతడు ఇప్పటికే దేశం వదిలి పారిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. (చదవండి: కాల్‌సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ!)

ఠక్కర్‌కు చాలా పెద్దపెద్ద కార్లు ఉన్నాయని, అతడు చాలా ధనవంతుడని పోలీసుల అదుపులో ఉన్న నిందితులతో పాటు సాక్షులు కూడా చెప్పారు. ఠక్కర్ విలాసవంతమైన జీవనశైలిని ఉదాహరణగా చూపించి.. అతడిలా జీవితాన్ని ఆస్వాదించాలంటే మరింత కష్టపడి మరింత ఎక్కువ సంపాదించాలని కొందరు సీనియర్లు చెప్పేవారన్నారు. తమ కాల్ సెంటర్లలోని ఉద్యోగులందరి నంబర్లతో వాట్సప్ గ్రూపులు ఉండేవని, వాటిలోనే తమకు అమెరికా పౌరుల గురించిన సమాచారం అందేదని మరో ఉద్యోగి చెప్పారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా వాళ్లకు నెలకు కేవలం రూ. 1.5 లక్షల డాలర్లు మాత్రమే వస్తే.. కింద ఉన్న ఫ్లోర్ల నుంచి నెలకు 5-7 లక్షల డాలర్లు వచ్చేవట.

ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న థానె పోలీసులను అమెరికాకు చెందిన పలు దర్యాప్తు సంస్థలు కూడా సంప్రదిస్తున్నాయి. ఇరువర్గాలూ తమ వద్ద ఉన్న వివరాలను పంచుకుంటున్నాయి. కాల్‌సెంటర్‌ గుట్టును రట్టు చేసినా, మొత్తం స్కాంలో ఇది చాలా చిన్న భాగం మాత్రమేనని, దీని మూలాలు వెలికితీస్తే ఇంకా పెద్ద స్కాం బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికా రెవెన్యూ లేదా ఇమ్మిగ్రేషన్ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకుంటూ ఫోన్లు చేసే కాల్ సెంటర్ ఉద్యోగులు.. పన్నులు కట్టనందుకు వాళ్లను బెదిరించి లక్షలాది డాలర్లు దండుకునేవారు. ఈ కేసులో ఇప్పటికి ఆ కాల్ సెంటర్ ఉద్యోగులలో 70 మందిని అరెస్టుచేయగా, మరో 630 మందికి నోటీసులు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement