కౌర్ ఇన్నింగ్స్:'నాతో పోల్చకండి ప్లీజ్!'
మహిళా ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగి ఆడిన సునామీ ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె చేసిన 171 పరుగుల ఇన్నింగ్స్‌ను 1983 వరల్డ్‌కప్‌లో కపిల్ దేవ్ చేసిన 175 పరుగులతో పోలుస్తున్నారు. టీమిండియా కోచ్ రవిశాస్త్రి.. కపిల్, హర్మన్‌ప్రీత్ ఇద్దరి ఫొటోలు పెట్టి ఆనాటి ఇన్నింగ్స్‌ను గుర్తుకుతెచ్చిందంటూ కామెంట్ చేశాడు. ఇక కామెంటేటర్లు హర్ష భోగ్లే, అలాన్ విల్కిన్స్ తదితరులు కపిల్-హర్మన్ ఇన్నింగ్స్‌లను పోలుస్తూ కొనియాడారు. అయితే, ఇలా పోల్చడంపై తాజాగా లెజెండ్ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. హర్మన్ కౌర్ ఇన్నింగ్స్‌ను సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా పోల్చకూడదని ఆయన కామెంట్ చేశారు.
'ఇప్పటికే భారత్ వరల్‌కప్ గెలిచిన భావన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇంగ్లండ్‌తో ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందుకే ఫైనల్‌లో వారికి శుభాభివందనలు తెలుపుతున్నా' అని కపిల్ మీడియాతో అన్నారు. ఇక హర్మన్ 171 పరుగులను తన ఇన్నింగ్స్‌తో పోల్చడంపై స్పందిస్తూ 'ఇలా పోల్చడం న్యాయం కాదు. ఆ రెండింటినీ పోల్చలేం. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు తెరపైకి తీసుకురాకూడదు. ఇప్పుడు మనమందరం హర్మన్ ఇన్నింగ్స్ ను సెలబ్రేట్ చేయాలి' అని కపిల్ సూచించారు. ఇక, 'మహిళా క్రికెటర్ల ఆటతీరు చూస్తుంటే గర్వంగా ఉందని, అద్భుతమైన విజయాన్ని సాధించిన వారికి అభినందనలు' అని కపిల్ శుక్రవారం ట్వీట్ చేశారు. చిరస్మరణనీయమైన ఆటతీరును హర్మన్ ప్రదర్శరించిందని కపిల్ కొనియాడారు.
మహిళల ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ అద్వితీయమై బ్యాటింగ్‌తో చెలరేగిన సంగతి తెలిసిందే. 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సులతో 171 పరుగులు చేసిన హర్మన్ ఫైనల్‌లోనూ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.