
బాబ్రీ మసీదు కేసు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వివాదస్పద బాబ్రీ మసీదు కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు బయట పరిష్కారానికి ఇరుపక్షాలు అంగీకరించాలని కోరింది.
బాబ్రీ మసీదు వివాదం మతానికి, సెంటిమెంటుకు సంబంధించిన అంశమని పేర్కొంది. నమ్మకాలకు సంబంధించిన విషయాల్లో కోర్టు బయట పరిష్కారమే శ్రేయస్కరమని తెలిపింది. అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ తెలిపారు.
బాబ్రీ మసీదు వివాదంపై అత్యవసరంగా విచారణ జరపాలని బీజేపీ సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. పిటిషనర్లు, ప్రతివాదులతో చర్చించి కోర్టు బయట వివాదాన్ని పరిష్కరించుకోవాలని స్వామికి న్యాయస్థానం సూచించింది. చర్చల ద్వారా పరిష్కారం దొరక్కపోతే తాము కల్పించుకుంటామని తెలిపింది. వివాదం పరిష్కారానికి మధ్యవర్తిని నియమిస్తామని ప్రకటించింది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. చర్చల ద్వారా బాబ్రీ మసీదు వివాదం పరిష్కారానికి సిద్ధమని తెలిపింది.