ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు పక్కా
- వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే సభకు బిల్లు: సీఎం కేసీఆర్
హైదరాబాద్: దేశంలో ఐదోవంతు జనాభా అయిన ముస్లింలు ఎస్సీ, ఎస్టీల కన్నా వెనుకబాటులో ఉన్నారన్న సుధీర్ కమిషన్ నివేదిక నూటికి నూరుపాళ్లు వాస్తవమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒక్క సుధీర్ కమిషనేకాదు, ఇప్పటివరకు ఏర్పాటయిన అన్ని కమిషన్లు ముస్లింల దుర్భరస్థితిపై కళ్లుచెదిరే నివేదికలు ఇచ్చాయని గుర్తుచేశారు. స్వాతంత్ర భారత చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా ముస్లింల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని తెలిపారు. బుధవారం శాసనసభలో మైనారిటీ సంక్షేమంపై జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే 'ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు' బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ముస్లింల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సభకు వివరించారు.
(ముస్లింలు.. సంచలన నివేదిక)
తెలంగాణ తొలి బడ్జెట్లోనే ముస్లింల అభివృద్ధికి రూ.1030 కోట్ల నిధులు కేటాయించామని, ఈ ఏడాది ఆ కేటాయింపులను రూ.1,204 కోట్లకు పెంచామని సీఎం కేసీఆర్ సభకు తెలిపారు. 'షాదీ ముబారక్' పథకం ద్వారా మైనార్టీ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఇప్పటివరకు 51,452 మందికి సహాయం అందించామని, ఇమామ్, మౌజమ్‌లకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి చెల్లిస్తున్నట్లు చెప్పారు. 2016-17 విద్యా సంవత్సరంలో 71 మైనారిటీ స్కూళ్లను కొత్తగా ఏర్పాటుచేశామని, వచ్చే(2017-18) విద్యాసంవత్సరంలో మరో 129 స్కూళ్లను ప్రారంభిస్తామని తెలిపారు.
(చదవండి: మైనారిటీలకు ప్రత్యేక గురుకులాలు)
బడ్జెట్ సమావేశాల్లోనే ముస్లిం రిజర్వేషన్ బిల్లు..
టీఆర్ఎస్ ఎన్నికల హామీలో అతిప్రధానమైనదైన ముస్లిం రిజర్వేషన్లపై వెనకడుగు వేసేదిలేదన్న ముఖ్యమంత్రి.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెడతామని, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆ మేరకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేశామని తెలిపారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా, మైనారిటీ గురుకులాలకు ప్రజల నుంచి విపరీతమైన పాజిటివ్ స్పందన వస్తున్నదని, బాలురకు కూడా స్కూళ్లు ప్రారంభించాలని ఎమ్మెల్యేలు అడుగుతున్నట్లు సీఎం సభలో చెప్పారు.