అసలు పెద్ద నోట్ల రద్దు ఎవరి కోసం?
న్యూఢిల్లీ: ‘కచ్చితంగా ఏడాదిలోగా భారత దేశాన్ని నగదు రహిత దేశంగా (క్యాష్‌లెస్ ఇండియా)గా మార్చి చూపిస్తాం’ అని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ, ఎకో వ్యవస్థాపకులు, సీఈవో అభిషేక్ సిన్హా, ఐస్పిరిట్ సహ వ్యవస్థాపకులు శరద్ శర్మ ముక్త కంఠంతో చెప్పారు. అదెప్పుడంటే 2016, జనవరి 16వ తేదీన ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో ‘స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా’ పేరిట జరిగిన కార్యక్రమంలో. స్టార్టప్ ఇండియా ఆర్థిక విధానాన్ని ఆవిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సును సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సిలికాన్ వ్యాలీ నుంచి దాదాపు పాతిక మంది ప్రసిద్ధ కంపెనీల సీఈవోలు కూడా హాజరయ్యారు.
మూడు కంపెనీల సీఈవోలు ప్రతిజ్ఞ నెరవేరాలంటే 2017, జనవరి 16వ తేదీ నాటికి భారత దేశం నగదు రహిత దేశంగా మారాలి. ఆ సదస్సు ముగిసిన నాటి నుంచి పెద్ద నోట్ల రద్దు వరకు ఈ మూడు కంపెనీలేవీ నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు తీసుకున్న పెద్ద చర్యలేవీ కనపించడం లేదు. ఈ రోజు నుంచి రూ. 500, రూ. 1000 రూపాయల నోట్లు చిత్తు కాగితాలతో సమానమంటూ ప్రధాని మోదీ నవంబర్ 8వ తేదీన చేసిన ప్రసంగంలోనూ ఎక్కడా నగదు రహిత లావాదేవీలకు సంబంధించి ఒక్క మాటైనా లేదు. కానీ ఆ మరుసరోజు పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఆయన ఫొటోలతో పేటీఎంలాంటి కంపెనీలు భారీ ఎత్తున వాణిజ్య ప్రకటనలను విడుదల చేశాయి. ప్రైవేట్ యాడ్‌కు ప్రధాని ఫొటోను ఉపయోగించడంపై వివాదం కూడా చెలరేగిన విషయం తెల్సిందే.
అభివద్ధి చెందిన దేశాలతోపాటు మనమూ అభివద్ధి చెందాలంటే నగదు రహిత ఆర్థిక వ్యవస్థవైపు అతివేగంగా అడుగులు వేయాల్సిందేనని, నూటికి నూరు శాతం సాధ్యం కాకపోయినా, అతి తక్కువ నగదును ఉపయోగించే స్థాయికి ఎదగాలని నవంబర్ 26వ తేదీన దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. నల్లడబ్బును అరికట్టేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని కూడా చెప్పారు. నవంబర్ 8వ తేదీన నల్లడబ్బును వెలికితీయడం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశానంటూ తన ప్రసంగంలో 18 సార్లు చెప్పిన మోదీ, నాడు ఒక్కసారి కూడా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు?
రద్దు చేసిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు డిసెంబర్ 30వ తేదీ వరకు గడువు పెడుతూ మోదీ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించి సరిగ్గా ఈ రోజుకు 30 రోజులు. అయినా పేదలు, కూలీలు, వలస కూలీలు, చిల్లర వ్యాపారస్థులు, పాకా హోటళ్ల నోట్ల కష్టాలు తీరలేదు. ఇక బీద, బిక్కీ పాట్లు చెప్పలేం. నోట్ల రద్దు కారణంగా వైద్యం అందక మరణిస్తున్న రోగుల రోదనలు ఆగలేదు. ప్రభుత్వ అంచనాల ప్రకారమే మొత్తం నల్ల ఆస్తుల్లో నల్లడబ్బు మూడు నుంచి ఐదు శాతానికి మించిలేదు. కేవలం అంత నల్లడబ్బు కోసం ఇంతమంది బడుగు వర్గాలను బాధలకు గురిచేయడం ఎంతమేరకు సమంజసం.
నాడు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లు పేదల బ్యాంక్ ఖాతాల్లో 15లక్షల రూపాయలను నరేంద్ర మోదీ జమ చేస్తారా? ఇప్పుడు నల్లడబ్బుతో బయటపడిన వారికి కఠిన శిక్షలు విధిస్తారా? ఇప్పటివరకు ఎంత నల్లడబ్బును పట్టుకున్నారో, ఎంత నల్లడబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ అయిందో చెప్పగలరా? అసలు పేద ప్రజల ప్రయోజనాలనాశించి నల్లడబ్బును వెలికితీయడం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశారా? ఏడాదిలోగా నగదు రహిత దేశంగా భారత్‌ను మారుస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన పేటీఎం లాంటి కార్పొరేట్ పెద్దల కోసమే పెద్ద నోట్లను రద్దు చేశారా?
–––––––––ఓ సెక్యులరిస్ట్ కామెంట్