Published
Fri, Feb 10 2017 11:28 AM
| Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
శశికళ పక్కన.. ఆ వ్యక్తి ఎవరు?
పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసినప్పటి నుంచి నోరు మెదపకుండా ఊరుకున్న చిన్నమ్మ శశికళ.. ఆ తర్వాత ఒక్కసారిగా పడగవిప్పిన పాములా బుసకొట్టారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్లే చేసి, ఒక్కసారిగా అందరినీ అటునుంచి అటే మూడు ఏసీ బస్సుల్లో రిసార్టులకు తరలించి క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. అయితే.. ఈ అన్ని సందర్భాల్లో శశికళ పక్కన ఉన్న వ్యక్తి గురించి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ గుసగులాడుకోవడం కనిపించింది.
అతనెవరో కాదు.. టీటీవీ దినకరన్! చిన్నమ్మ శశికళకు స్వయానా మేనల్లుడు!! తన మీద కుట్ర పన్నారంటూ జయలలిత పోయెస్ గార్డెన్స్ నుంచి గెంటేసినవాళ్లలో దినకరన్ కూడా ఒకరు. శశికళను మళ్లీ రానిచ్చిన జయలలిత.. దినకరన్ సహా మరికొందరు బంధువులను మాత్రం అస్సలు పోయెస్ గార్డెన్స్ సమీపంలోకి కూడా రావడానికి వీల్లేదని అప్పట్లో హుకుం జారీ చేశారు. ఇదే దినకరన్ గత రెండు నెలలుగా మళ్లీ శశికళ వెంట కనిపిస్తున్నారు. అధికారికంగా పార్టీ తరఫున నిర్వహించే సమావేశాలన్నింటిలో కూడా శశికళ పక్కనే దినకరన్ కూర్చుని ఉన్న ఫొటోలు కనిపిస్తున్నాయి. గవర్నర్ వద్దకు శశికళ వెళ్లినప్పుడు సైతం ఆమె పక్కన దినకరన్ ఉండటంతో ఒక్కసారిగా మళ్లీ అతగాడి పాత్రపై చర్చలు మొదలయ్యాయి. అయితే పార్టీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు గానీ, గవర్నర్ వద్ద గానీ దినకరన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌన ప్రేక్షకుడిలాగే పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్నారు.