‘మ్యాజిక్’ చేసేదెవరు?
తమిళనాడులో నేడే బలపరీక్ష... పది ఓట్లే కీలకం
- ఉదయం 11 గంటలకు అసెంబ్లీ.. పన్నీర్ గూటికి మైలాపూర్ ఎమ్మెల్యే
- పళని క్యాంప్‌లోని 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు
- హుటాహుటిన రిసార్ట్స్‌కు సీఎం.. ఎమ్మెల్యేల బుజ్జగింపు
- పళని శిబిరంలో 123.. పన్నీర్ వద్ద 12 మంది ఎమ్మెల్యేలు
- పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామన్న డీఎంకే
- అధిష్టానం ఆదేశానుసారం నడుస్తామన్న కాంగ్రెస్
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
తమిళనాడు రాజకీయ పరిమాణాలు చివరిఘట్టంలోనూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీలో నేడు ఉదయం 11 గంటలకు జరగనున్న బలపరీక్షపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామికి బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగర్‌రావు 15 రోజుల గడువు ఇచ్చినప్పటికీ ఆయన శనివారమే బలం నిరూపించుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.
సంఖ్యాపరంగా పళనిస్వామివైపే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఎవరికీ మద్దతివ్వబోమని ప్రకటించిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్.. తాజాగా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించి హైడ్రామాకు తెరలేపారు. అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనంటూ... మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ నటరాజన్ తాజాగా పన్నీర్ శిబిరంలోకి చేరారు. అమ్మ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు కుటుంబపాలనకు, విశ్వాసతీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాజనీ సీఎం పన్నీర్ సెల్వం విజ్ఞప్తి చేశారు.
కువత్తూరు క్యాంప్‌లో ఉన్న 20మంది ఎమ్మెల్యేలు తిరుగుబాట పట్టారన్న వార్తలు సంచలనం రేకెత్తించాయి. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పళనిస్వామి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు జైలునుంచి శశికళ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు రహస్య ఓటింగ్ డిమాండ్ చేస్తూ పన్నీర్ మద్దతుదారులు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్ రహస్య ఓటింగ్‌కు అనుమతిస్తే పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారతాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. క్యాంపులో ఉన్నవారిలో పదిమంది పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసినా పరిస్థితులు తారుమారవుతాయి.
దీంతో శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కాపాడుకుని బలపరీక్షలో సత్తా చాటేందుకు పళనిస్వామి వ్యూహాలు రచిస్తున్నారు. మరో పదిమందినైనా ఆకర్షించడంద్వారా పళనిస్వామి ప్రభుత్వాన్ని గద్దె దించి శశికళను దెబ్బ కొట్టాలని విపక్షాలు పథకాలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జరుగనున్న బలపరీక్షలో విజయమెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాక్షేత్రంలో జయలలిత బొమ్మతో గెలుపొందిన ఎమ్మెల్యేలు అమ్మ నమ్మినబంటువైపు నిలుస్తారా? చిన్నమ్మ నమ్మినబంటుకు ఓటేస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉత్కంఠగా తమిళ రాజకీయాలు
పురట్చితలైవి జయలలిత మరణం తరువాత ఆపద్ధర్మ సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం, చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు చేయడంతో తమిళ రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పదిరోజుల హైడ్రామా తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ జైలు పాలుకావడం... పన్నీర్ పదవీచ్యుతుడవ్వడం.. ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. బలపరీక్షకు 15 రోజులు సమయం ఉన్నా... 18నే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి పళనిస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఆ తరువాత కొన్ని గంటల్లో చెన్నైలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌కు తీసుకొచ్చిన ఎమ్మెల్యేలను తిరిగి కువత్తూరులోని రిసార్ట్స్‌కు తరలించారు. ఆ తరువాత మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్ శుక్రవారం ఉదయం పళనిస్వామికి ఝలక్ ఇచ్చి పన్నీర్ శిబిరంలో వచ్చి చేరారు. తాను అమ్మ ఫొటోతో గెలిచానని, అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. అవసరమైతే తిరిగి అమ్మఫొటోతో ఎన్నికలకు వెళ్లేందుక్కూడా వెనుకాడబోనని ప్రకటించినట్లు తెలిసింది.
20 మంది తిరుగుబాటు
నటరాజన్ ప్రకటన వెలువడిన వెంటనే రిసార్ట్స్‌లో ఉన్న సుమారు 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు సమాచారం. అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను వారు తెరమీదకు తెచ్చారు. వెంటనే తీర్చకపోతే తమ నిర్ణయం మరోలా ఉంటుందని హెచ్చరించారు. దీంతో పళనిస్వామి బెంగళూరు పర్యటను రద్దు చేసుకున్నారు. హుటాహుటిన శుక్రవారం రిసార్ట్స్‌కు వెళ్లి ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. బెంగళూరు జైల్లో ఉన్న శశికళ కూడా తమ వద్దకు రావడం కంటే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూడమని హుకుం జారీచేసినట్లు తెలిసింది.
క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేలందరితో శశకళ జైలు నుంచి ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. బలనిరూపణలో గెలిచిన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అసంతృప్త ఎమ్మెల్యేలకు ఆశ చూపినట్టు తెలుస్తోంది. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేయాలని భావించే ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వారి బంధువులు, అనుచరులను రిసార్ట్స్‌కు పిలిపించి ఒప్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రిసార్ట్స్ పరిసర ప్రాంతాల్లో వాహనాలతో నిండిపోయాయి. రిసార్ట్స్‌కు వచ్చిపోయే వారిని మన్నార్‌గుడి సైన్యం క్షుణ్ణంగా పరిశీలించి అనుమతిస్తోంది. రిసార్ట్స్ గేటు ముందు, కువత్తూరు ముఖద్వారం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.
రహస్య ఓటింగ్‌కు డిమాండ్
అసెంబ్లీలో నిర్వహించనున్న బలపరీక్షను రహస్యంగా చేపట్టాలని పన్నీర్‌సెల్వం మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ ధనపాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. క్యాంప్‌లో అనేకమంది ఎమ్మెల్యేను నిర్బంధించారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బలపరీక్షలో ఎమ్మెల్యేలంతా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని కోరారు. మరోవైపు పన్నీర్‌సెల్వంకు మద్దతుగా ప్రజలు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నివాసాలను, కార్యాలయాలను ముట్టడించారు. పన్నీర్ అనుకూలంగా ఓటెయ్యకపోతే నియోజకవర్గాల్లో తిరగలేరని హెచ్చరించారు.
30 ఏళ్ల తరువాత బలపరీక్ష రిపీట్
తమిళనాడు రాజకీయాల్లో బలపరీక్షలు, అవిశ్వాస తీర్మానాలూ కొత్తేమీ కాదు. 1952లో రాజాజీపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, 200 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా ఓటేసి తిరిగి సీఎంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత 1972 డిసెంబర్ 11న డీఎంకే నేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే పార్టీలో ఉన్న ఎంజీ రామచంద్రన్‌ను పార్టీ నుంచి తొలగించారు. ఆ సమయంలో సీఎం కరుణానిధిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ బలపరీక్షలో కరుణానిధికి అనుకూలంగా 172 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో ఆయనే సీఎంగా ఎన్నికయ్యారు.
1988లో ఎంజీ రామచంద్రన్ మరణించాక అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే (జా) జానకీ రామచంద్రన్, అన్నాడీఎంకే (జే) జయలలిత సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. జనవరి 28న బలపరీక్ష నిర్వహించారు. స్పీకర్ పీహెచ్ పాండ్యన్ సమక్షంలో నిర్వహించిన బలపరీక్షలో జానకీ రామచంద్రన్ సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యారు. జానకీ రామచంద్రన్‌కు అనుకూలంగా 99 మంది, జయలలితకు అనుకూలంగా 33 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. ఆ సమయంలో అసెంబ్లీలో జరిగిన గొడవలో 29 మంది ఎమ్మెల్యేలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు ఆదేశించారు. జయలలిత మరణంతో 30 ఏళ్ల తరువాత తమిళనాడు అసెంబ్లీ మరోసారి బలపరీక్షకు సిద్ధమవుతోంది. నేడు జరుగనున్న బలపరీక్ష ఎవరికి పరీక్ష కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.