అమ్మకు ఓటేయండి | Vote for Amma, O.Panneerselvam calls to MLAs | Sakshi
Sakshi News home page

అమ్మకు ఓటేయండి

Published Sat, Feb 18 2017 2:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

అమ్మకు ఓటేయండి

అమ్మకు ఓటేయండి

ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పిలుపు
సాక్షి ప్రతినిధి, చెన్నై:
తమిళనాడు ప్రజలు అమ్మను చూసి అన్నాడీఎంకేను గెలిపించారు... విశ్వాస తీర్మానంపై ఓటేసే ముందు ఒక్కసారి అమ్మను తలచుకోవాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. కుటుంబ పాలనకు జయలలిత పూర్తిగా వ్యతిరేకమని గుర్తుచేసుకోండి, రాష్ట్రాన్ని కుటుంబ పాలన నుంచి రక్షించండని విజ్ఞప్తి చేశారు.

విశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓటువేస్తే అది ప్రజలకు, అమ్మ ప్రభుత్వానికి చేసిన ద్రోహమవుతుందని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం చెన్నైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యేలు ఎటువంటి ప్రలోభాలకు లొంగరని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కోరుకున్నవారికే రెండాకుల చిహ్నం సొంతమన్నారు. విశ్వాస పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వం నెగ్గినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజాన్యాయస్థానంలోనే ఎమ్మెల్యేలను నిలదీసేందుకు పన్నీర్‌ సిద్ధమవుతున్నారు.

ర్యాలీకి పోలీసుల బ్రేక్‌
ప్రజామద్దతును కూడగట్టుకుని ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకు పన్నీర్‌సెల్వం వర్గం శుక్రవారం తలపెట్టిన ర్యాలీకి పోలీసులు బ్రేకు వేశారు. మరోవైపు అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలపై  ఒత్తిడి పెంచేందుకు జల్లికట్టు తరహా ఉద్యమానికి  యువత మెరీనా బీచ్‌కు చేరుకుంటారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మెరీనాతీరమంతా భారీగా బారికేడ్లు ఏర్పాటుచేసి, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

కాగా, ముఖ్యమంత్రి హోదాలో పన్నీర్‌సెల్వం తన కుటుంబం సహా నివసిస్తున్న చెన్నై గ్రీన్‌వేస్‌ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ప్రజాపనుల శాఖ ఆయనకు నోటీసులు జారీచేసింది. ఇదిలా ఉండగా.. పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్‌సెల్వం, ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌ తదితరులను బహిష్కరిస్తున్నట్లు గతంలో శశికళ ప్రకటించారు. ఇప్పుడు శశికళ, సీఎం పళనిస్వామి, మంత్రుల హోదాలో ఉన్నవారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పన్నీర్‌వైపున్న ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌ ప్రకటించారు.

విద్యార్థిని ఆడియో హల్‌చల్‌
శశికళా వద్దూ... ఆమెకు మద్దతు పలుకుతున్న మీరూ వద్దంటూ విద్యాశాఖ మంత్రి సెంగొట్టయన్‌ను ఉద్దేశించి ఒక విద్యార్థిని చేసిన విమర్శల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. గోపిచెట్టి పాళయంకు చెందిన కాలేజీకి చెందిన ఒక విద్యార్థిని సెంగోట్టయన్‌కు ఫోన్‌ చేయగా మీటింగ్‌లో ఉన్నారని ఆయన అనుచరుడు బదులిచ్చాడు. దీంతో మంత్రికి తన అసంతృప్తిని చేరవేయమని చెబుతూ జరిగిన సంభాషణలను సామాజిక మాధ్యమాల్లో పెట్టింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement