విజేత పళని | Tamil Nadu CM E.Palaniswami wins the floor test | Sakshi
Sakshi News home page

విజేత పళని

Published Sun, Feb 19 2017 1:42 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

విజేత పళని

విజేత పళని

అనుకూలం 122.. ప్రతికూలం 11
- 29 ఏళ్ల తరువాత చరిత్ర పునరావృతం
- రణరంగంగా మారిన తమిళనాడు శాసనసభ... రహస్య ఓటింగ్‌ కోసం పట్టుబట్టిన డీఎంకే

- కుదరదన్న స్పీకర్‌ ధన్‌పాల్‌... విపక్ష సభ్యుల వాగ్వివాదం
- అధికార, విపక్ష సభ్యుల బాహాబాహీ
- తోపులాటలో విరిగిన మైక్‌లు.. చిరిగిన చొక్కాలు
- అసెంబ్లీలో యుద్ధ వాతావరణం.. రెండుసార్లు వాయిదా
- డీఎంకే సభ్యుల బహిష్కరణ... కాంగ్రెస్, ముస్లింలీగ్‌ వాకౌట్‌
- విపక్ష సభ్యులెవరూ లేకుండానే బలపరీక్ష


చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/సాక్షి ప్రతినిధి, చెన్నై:
అరుపులు, కేకలు.. ఎగిరిపడిన కుర్చీలు.. విరిగిన మైకులు.. పడిన బెంచీలు.. చిరిగిన చొక్కాలు.. ఎగిరిన కాగితాలు.. ఎమ్మెల్యేల బాహాబాహీ.. మార్షల్స్‌ బలప్రయోగంతో తమిళనాడు శాసనసభ రణరంగంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష రణరంగాన్ని తలపించింది.

బలపరీక్షను రహస్య ఓటింగ్‌ ద్వారా నిర్వహించాలని ప్రతిపక్ష డీఎంకే పట్టుబట్టింది. అందుకు స్పీకర్‌ తిరస్కరించడంతో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్పీకర్‌ మైక్‌ విరిగింది. ఎమ్మెల్యేల చొక్కాలు చిరిగాయి. శాసనసభ యుద్ధవాతావరణాన్ని తలపించింది. స్పీకర్‌ ధన్‌పాల్, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్‌ పరాభవం పాలయ్యారు. ఎట్టకేలకు ప్రతిపక్ష డీఎంకే సభ్యుల బహిష్కరణ.. కాంగ్రెస్, ముస్లింలీగ్‌ సభ్యుల వాకౌట్‌ తర్వాత... ప్రతిపక్షంలేని సభలో సీఎం పళనిస్వామి విజయం సాధించారు.

అన్నాడీఎంకేలోని వైరి వర్గాల నడుమ సాగిన బలపరీక్షలో అనేక ఉద్రిక్త పరిణామాల మధ్య పళనిస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం 122 ఓట్లతో నెగ్గింది. ఆయనకు వ్యతిరేకంగా పన్నీర్‌ వర్గానికి చెందిన కేవలం11మంది ఓటు వేశారు. ఎట్టకేలకు రెండువారాల ఉత్కంఠకు తెరపడింది. అమ్మ ప్రభుత్వాన్ని పరిరక్షించుకున్నామని సీఎం పళనిస్వామి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గడంతో పదిరోజులపాటు ఎమ్మెల్యేల నివాసంగా మారిన గోల్డన్‌బే రిసార్టు ఖాళీ అయింది. సీఎంకు వ్యతిరేకంగా ఈరోడ్, కాంగేయం, భవానీల్లోని అన్నాడీఎంకే కార్యాలయాల ముందు పన్నీర్, దీప వర్గీయులు ఆందోళన చేశారు. సీఎం ఇంటిని స్టానికులు ముట్టడించే యత్నం చేశారు. విశ్వాసతీర్మానం ఫలితాలు ఎలా ఉంటాయోనని ఉత్కంఠ నెలకొనడంతో ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే సినిమా థియేటర్లు, పార్కులు జనం లేక బోసిపోయాయి.

జయ మరణంతో ముసలం...
పురచ్చి తలైవి జయలలిత మరణం తర్వాత పన్నీర్‌ సెల్వం సీఎం కావటం.. కొద్దిరోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆ తరువాత అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళపై పన్నీర్‌ తిరుగుబాటుతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేల క్యాంప్‌ రాజకీయాలకు శ్రీకారం చుట్టిన నాలుగో రోజు హైకోర్టు సంచలన తీర్పుతో శశికళ జైలు పాలవడం చకచకా జరిగిపోయాయి. సీఎం పీఠం కోసం శశికళ, పన్నీర్‌ సెల్వం మధ్య జరిగిన పోటీలో అనూహ్యంగా పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. బలనిరూపణకు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు 15 రోజులు సమయం ఇచ్చినా, సీఎం ప్రమాణస్వీకారం చేసిన రెండవ రోజే పళనిస్వామి బలపరీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆమేరకే శనివారం ఉదయం 9–10:30 గంటల మధ్య రాహుకాలం కావడంతో 8.45 గంటలకే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూవత్తూరు క్యాంపు నుంచి బయలుదేరారు. ఒక్కో మంత్రి కారులో నలుగురు ఎమ్మెల్యేల చొప్పున 30 మంది మంత్రుల కారుల్లో 120 మంది ఎమ్మెల్యేలు, సీఎం కారులో ఇద్దరు కూర్చోగా పోలీసు బందోబస్తు నడుమ అసెంబ్లీకి చేరుకున్నారు.

అసెంబ్లీలో రచ్చ రచ్చ...
తమిళనాడు అసెంబ్లీ శనివారం ఉదయం 11గంటలకు ప్రారంభమైంది. స్పీకర్‌ ధనపాల్‌ ప్రకటనతో సీఎం పళనిస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ వెంటనే ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్‌ లేచి అధికార అన్నాడీఎంకే పార్టీ విప్‌ ఎవరో ప్రకటించాలని పట్టుబట్టారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గం సెమ్మలైని విప్‌గా ప్రకటించగా... పళనిస్వామి వర్గం విప్‌ను ప్రకటించకుండానే విశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. దీంతో ప్రతిపక్ష డీఎంకే విశ్వాస పరీక్షను అడ్డుకుంది. ఎమ్మెల్యేలంతా ఆయా నియోజకవర్గాలకు వెళ్లి ప్రజాభిప్రాయం తీసుకున్న తరువాతే ఓటింగ్‌కు అనుమతి ఇవ్వాలని స్టాలిన్, పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. అందుకు స్పీకర్‌ తిరస్కరించారు. అయితే రహస్య ఓటింగ్‌ నిర్వహించాలని వారిద్దరూ పట్టుబట్టారు. స్పీకర్‌ అందుకు నిరాకరించడంతో స్టాలిన్‌తో పాటు డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నేలపై కూర్చొని నిరసన తెలియజేశారు. తన అధికారాల్లో ఇతరుల జోక్యాన్ని సహించేది లేదని స్పీకర్‌ ప్రకటించి సమావేశాన్ని గంటపాటు వాయిదా వేశారు.

తిరిగి ఒంటిగంటకు అసెంబ్లీ ప్రారంభమైనా ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు, పన్నీర్‌సెల్వం మద్దతుదారులు రహస్య ఓటింగ్‌కు పట్టుబట్టారు. స్పీకర్‌ ససేమిరా అనడంతో అన్నాడీఏంకే, డీఏంకే ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటల్లో బల్లలు ధ్వంసమయ్యాయి... మైక్‌లు విరిగాయి... పేపర్లు చిరిగాయి. సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకానొక సమయంలో ఇద్దరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కుక సెల్వం, రంగనాథన్‌ స్పీకర్‌ సీటు వద్ద నిల్చొని నినాదాలు చేస్తున్నారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో కొన్ని క్షణాలపాటు స్పీకర్‌ సీట్లో కూర్చొన్నారు. తనను కిందకు లాగేసి, చొక్కా చించారంటూ స్పీకర్‌ ధనపాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే డీఎంకే సభ్యులందరిపైనా సస్పెన్షన్‌ వేటు వేశారు.

అయితే సభను నుంచి బయటకు వెళ్లేందుకు డీఎంకే సభ్యులు నిరాకరించారు. తాము ప్రజలకోసం పోరాడుతున్నామని, తమను బలవంతంగా బయటకు తీసుకెళ్తే ఆత్మహత్యలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. ఎట్టకేలకు మార్షల్స్‌ 2.50 గంటలకు ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా సభనుంచి ఖాళీ చేయించగలిగారు. సుమారు 25 మంది మార్షల్స్‌ ప్రతిపక్ష నేత స్టాలిన్‌ను చేతుల్తో పైకి ఎత్తుకుని బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో జరిగిన పెనుగులాటలో స్టాలిన్‌ చొక్కా చిరిగిపోయింది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్‌ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలిశారు. సభలో తమపై జరిగిన దౌర్జన్యం గురించి ఫిర్యాదు చేశారు. అనంతరం మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. డీఎంకేకు మద్దతుగా వారి మిత్రపక్షం కాంగ్రెస్, ముస్లింలీగ్‌ కూడా బలనిరూపణను బాయ్‌కాట్‌ చేశాయి.

ప్రతిపక్షాలు లేకుండా తీర్మానం...
ప్రతిపక్ష సభ్యులెవరూ లేకుండా సభ మూడు గంటలకు మళ్లీ ప్రారంభమైంది. సీఎం పళనిస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్‌ చదివి వినిపించారు. తీర్మానంపై సభ్యులు ప్రసంగించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పరిపాటైనా... నేడు అసెంబ్లీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లేచి నిలబడితే లెక్కించే ప్రక్రియను ప్రవేశపెడుతున్నానని స్పీకర్‌ చెప్పారు. ముందువైపున మూడు లైన్లలో అన్నాడీఎంకే, వెనుకవైపున్న మిగిలిన మూడులైన్లలో డీఎంకే, కాంగ్రెస్‌ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అయితే తీర్మానం ప్రవేశపెట్టే సమయానికి ప్రతిపక్ష సభ్యులెవ్వరూ సభలో లేరు. పళనిస్వామి ప్రవేశపెట్టిన విశ్వాసతీర్మానంపై అసెంబ్లీలో సభ్యులు లేచి నిలబడి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగానే అనుకూలంగా 122, ప్రతికూలంగా 11 ఓట్లు వచ్చినట్లు స్పీకర్‌ ప్రకటించారు.

చరిత్ర పునరావృతం...
తమిళనాడు రాజకీయాల్లో బలపరీక్షను ఎదుర్కొన్న పార్టీగా అన్నాడీఎంకే మరోసారి చరిత్ర సృష్టించింది. ఎంజీఆర్‌ మరణం తరువాత జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాల మధ్య పోటీ తలెత్తింది. 1988 జనవరి 27న ముఖ్యమంత్రి పీఠానికి బలపరీక్ష నిర్వహించారు. అప్పుడు కూడా అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సభ్యులు సభలోనే కొట్టుకున్నారు. తప్పని పరిస్థితుల్లో తొలిసారి పోలీసులు సభలోకి ప్రవేశించాల్సి వచ్చింది. జయలలిత వర్గానికి నెడుంజెళియన్‌ నాయకత్వం వహించారు. ఆ సమయంలో స్పీకర్‌గా ఉన్న పీహెచ్‌ పాండియన్‌ ఓటింగ్‌ ప్రారంభం కావడానికి ముందు ప్రతిపక్ష సభ్యులపై అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. చివరకు జానకీ రామచంద్రన్‌ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. అదే విధంగా శనివారం జరిగిన విశ్వాస పరీక్షలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్‌ చొక్కా చిరిగిపోయింది. ప్రతిపక్ష నేత స్టాలిన్‌ చొక్కాను చించివేశారు. తమకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలని ఇటు స్పీకర్, అటు ప్రతిపక్ష నేత ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మీద ఎప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించినా తమిళనాడు శాసనసభలో యుద్ధవాతావరణం నెలకొనడం గమనార్హం.

తీరని అవమానం: స్పీకర్‌ ధనపాల్‌
అసెంబ్లీ చరిత్రలో ఎవ్వరూ ఎరగని, జరగకూడని అవమానానికి తాను లోనైనానని స్పీకర్‌ ధనపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బలనిరూపణ తర్వాత ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల్లో అట్టడుగు ఆది ద్రావిడ సామాజిక వర్గానికి చెందిన తాను అమ్మ దయవల్ల ఇంతటి ఉన్నతస్థితికి చేరుకున్నానని చెప్పారు. ప్రధానప్రతిపక్ష నేత నడుచుకున్న తీరు ఎంతో బాధాకరమని, ఆయన వైఖరికి సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. తాను నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నానని స్పష్టంచేశారు. అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అమ్మ ప్రభుత్వం నిలబడింది: సీఎం పళనిస్వామి
తమిళనాడులో అమ్మ ప్రభుత్వాన్ని పరిరక్షించుకున్నామని సీఎం పళనిస్వామి ఆనందం వ్యక్తంచేశారు. విశ్వాసతీర్మానం నెగ్గగానే మంత్రివర్గ సహచరులతో కలిసి మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధి వద్దకు వచ్చి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... విశ్వాస తీర్మానాన్ని విఫలం చేసేందుకు డీఎంకే, కాంగ్రెస్‌ సభ్యులు విశ్వప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎంజీఆర్, జయలలితల ఆశయాల సాధన కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ చిన్నమ్మ చేసిన శపథం నెరవేరిందన్నారు. అన్నాడీఎంకే నుంచి విడిపోయినవారంతా డీఎంకేతో చేతులు కలిపారని, అసెంబ్లీ చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. నెగ్గిన విశ్వాస తీర్మానాన్ని గవర్నర్‌కు పంపామని తెలిపారు.

బలపరీక్ష సమయానికి సభలో 133మందే
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 235 మంది సభ్యులుండగా శనివారం 230 మంది హాజరయ్యారు. అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 136 సభ్యుల బలం ఉండగా జయ మరణంతో 135 మంది ఉన్నారు. ఇందులో శశికళ వర్గానికి చెందిన 122 మంది, పన్నీర్‌సెల్వానికి చెందిన 11 మంది హాజరయ్యారు. పన్నీర్‌ వర్గానికి చెందిన కోయంబత్తూరు ఎమ్మెల్యే అరుణ్‌కుమార్‌ గైర్హాజరుతో మొత్తం 133గా మిగిలింది. డీఎంకేకు 89 మంది సభ్యులుండగా అస్వస్థత కారణంగా డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అసెంబ్లీకి రానందున 88 మంది సభ్యులు హాజరయ్యారు. అలాగే 8 మంది కాంగ్రెస్‌ సభ్యులు, ముస్లింలీగ్‌ ఎమ్మెల్యే వచ్చారు. అయితే డీఎంకే సభ్యులను బహిష్కరించడం... కాంగ్రెస్, ముస్లింలీగ్‌ సభ్యులు బహిష్కరించడంతో ఓటింగ్‌ సమయానికి సభలో అన్నాడీఎంకేకు చెందిన 133మంది సభ్యులు మాత్రమే మిగిలారు.

మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి

జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి

చెన్నైకు చిన్నమ్మ?

అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్‌

నాడూ.. నేడూ.. అదే డ్రామా!

చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్‌

స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement