బీఎస్ఎఫ్ ఐజీ ఉపాథ్యాయ
- బీఎస్‌ఎఫ్ ఐజీ డి.కె. ఉపాథ్యాయ సంచలన వ్యాఖ్యలు
- ‘బీఎస్‌ఎఫ్ జవాన్ వీడియో’పై విచారణకు ఆదేశం
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లో జవానుల దీన స్థితిపై బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్ బుక్లో పోస్ట్ చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపడమేకాక ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఉదంతంపైన, వీడియోలో పేర్కొన్న అంశాలపైనా విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్) ఇన్‌స్పెక్టర్ జనరల్ డి.కె. ఉపాథ్యాయ మంగళవారం జమ్ములో మీడియాతో మాట్లాడుతూ ఉదంతానికి సంబంధించిన అనేక విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘మన సైనికులకు అందించే భోజనం ఏమంత బాగుండదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. పైగా ఇది చలికాలం కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే ఇప్పటివరకు ఈ విషయంలో ఏ ఒక్కరూ ఫిర్యాదు చెయ్యలేదు. బీఎస్‌ఎఫ్ చరిత్రలోనే మొదటిసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో అందరం షాకయ్యాం! నిజానికి ఇదొక సున్నితమైన అంశమైనందున ముందుకుముందే ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం. సమగ్ర దర్యాప్తు తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’అని ఐజీ ఉపాథ్యాయ తెలిపారు.
డ్యూటీలో అతనికి మొబైల్‌ఫోన్ ఎక్కడిది?
జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ పోస్ట్ చేసిన వీడియోలోని అంశాలను పక్కన పెడితే, డ్యూటీలో ఉండగా అతను మొబైల్ ఫోన్ ఎందుకు తీసుకెళ్లాడు? అనేది వివాదాస్పదమైంది. ‘బీఎస్‌ఎఫ్ నియమావళి ప్రకారం డ్యూటీలో ఉండే జవాన్లు మొబైల్ ఫోన్లు వినియోగించకూడదు. తేజ్ బహదూర్ ఆ నిబంధనలను అతిక్రమించి మొబైల్‌ను వినియోగించాడు. చుట్టుపక్కల దృశ్యాలన్నీ కనిపించేలా వీడియోలో మాట్లాడాడు. ఇది క్షమించరాని తప్పిదం. ఈ విషయంలో అతనిపై విచారణ తప్పదు’అని ఐజీ ఉపాథ్యాయ పేర్కొన్నారు. (బీఎస్‌ఎఫ్ జవాన్ సంచలన వీడియో)
సదరు వీడియో పోస్ట్ చేసిన తేజ్‌బహదూర్ యాదవ్ గతంలో(2010)నూ ఓసారి క్రమశిక్షణా నియమాలను ఉల్లంఘించి, కోర్ట్‌మార్షల్‌కు గురయ్యేపరిస్థితిని కొనితెచ్చుకున్నాడని ఐజీ తెలిపారు. కుటుంబపరిస్థితి దృష్ట్యా అప్పట్లో అతనిని క్షమించి వదిలేశామని గుర్తుచేశారు. వీడియో వైరల్ అయిందని తెలిసిన వెంటనే డీఐజీ స్థాయి అధికారి ఒకరు తేజ్‌బహదూర్ పనిచేస్తోన్న ప్రాంతానికి వెళ్లి, తనిఖీలు చేపట్టారని, ఆ సమయంలో తేజ్‌బహదూర్ నుంచిగానీ, ఇతర జవాన్లనుంచిగానీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఐజీ ఉపాథ్యాయ చెప్పారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా జవాన్ తేజ్ బహదూర్‌ను మరో హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు.