జియో డౌన్లోడు స్పీడులో దూసుకుపోయింది!
జియో డౌన్లోడు స్పీడులో దూసుకుపోయింది!
Published Wed, Jan 11 2017 11:59 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో 4జీ.. చాలా స్లో గురూ అంటూ వచ్చిన కామెంట్లను ఛాలెంజ్గా తీసుకున్న కంపెనీ డిసెంబర్ లో ఇంటర్నెట్ స్పీడులో దూసుకుపోయింది. 2016 డిసెంబర్లో జియో నెట్వర్క్ స్పీడు భారీగా పెరిగినట్టు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ వెల్లడించింది. సెకనుకు జియో నెట్వర్క్ సగటు డౌన్ లోడ్ స్పీడు 18.16 ఎంబీపీఎస్ను తాకిందట. సెప్టెంబర్లో వాణిజ్య 4జీ సర్వీసులతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇదే అత్యధికమైన స్పీడని ట్రాయ్ డేటా పేర్కొంది. నెలవారీ సగటు మొబైల్ డేటా స్పీడును ట్రాయ్ వెల్లడిస్తోంది.
ట్రాయ్ డేటా ప్రకారం డిసెంబర్ నెలలో జియో డౌన్ లోడ్ స్పీడు 18.16 ఎంబీపీఎస్ను తాకింది. కాగ, నవంబర్లో జియో నెట్ వర్క్ డౌన్లోడు స్పీడు దారుణంగా ఉందని ట్రాయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. స్పీడు ఇంటర్నెట్ ను ఇస్తామన్న కంపెనీ అప్పుడు కేవలం 5.85 ఎంబీపీఎస్ స్పీడునే అందించింది. లాంచింగ్ సమయంలో జియో స్పీడు 7.26 ఎంబీపీఎస్ ఉండేది. దీంతో ఇతర టెలికాం నెట్వర్క్లతో పోలిస్తే జియో స్పీడు దారుణంగా ఉందంటూ ట్రాయ్ పేర్కొంది.
ఆ కామెంట్లను ఛాలెంజ్గా తీసుకున్న కంపెనీ డిసెంబర్ నెలలో తన స్పీడును వేగంగా పెంచుకుని 18.16 ఎంబీపీఎస్ ను తాకింది. ఇతర నెట్వర్క్లు వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడు 6.7 ఎంబీపీఎస్, ఐడియా స్పీడు 5.03 ఎంబీపీఎస్, భారతీ ఎయిర్టెల్ స్పీడు 4.68 ఎంబీపీఎస్, బీఎస్ఎన్ఎల్ స్పీడు 3.42ఎంబీపీఎస్, ఎయిర్సెల్ స్పీడు 3ఎంబీపీఎస్, రిలయన్స్ కమ్యూనికేషన్ స్పీడు 2.6 ఎంబీపీఎస్ ఉన్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది.
Advertisement
Advertisement