భక్తులు, యాత్రీకులను గగుర్పాటుకు గురిచేసేలా భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో చార్‌ధామ్ యాత్ర నిలిచిపోయింది.
- విష్ణుప్రయాగ వద్ద విరిగిపడిన కొండచరియలు
- నిలిచిన చార్‌ధామ్ యాత్ర.. చిక్కుకుపోయిన 15000మంది భక్తులు
న్యూఢిల్లీ: భక్తులు, యాత్రీకులను గగుర్పాటుకు గురిచేసేలా భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో శుక్రవారం చార్‌ధామ్ యాత్ర నిలిచిపోయింది. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో అంతర్భాగమైన విష్ణుప్రయాగ ప్రాంతంలో నేటి సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్‌కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది.
రహదారి మూసుకుపోవడంతో కనీసం 15 వేల మంది యాత్రీకులు ఎక్కడివారు అక్కడే ఆగిపోవాల్సివచ్చింది. వందలల సంఖ్యలో వాహనాలు బారులుతీరాయి. సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి, రహదారిని పునరుద్ధరించేపనిలో నిమగ్నం అయ్యారు.
కాగా, ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనే విషయాలు తెలియాల్సిఉంది. నాలుగేళ్ల కిందట చార్‌ధామ్ యాత్రలో పెనువిలయం సంభవించి వందలాదిమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.