క్షిపణితో మలేసియా విమానం కూల్చివేత! | malaysian flight crashed with missile, 295 dead | Sakshi
Sakshi News home page

క్షిపణితో మలేసియా విమానం కూల్చివేత!

Published Fri, Jul 18 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

గ్రబావొ గ్రామ సమీపంలో విమాన శకలాల మధ్యలో ప్రయాణికుల మృతదేహాలు

గ్రబావొ గ్రామ సమీపంలో విమాన శకలాల మధ్యలో ప్రయాణికుల మృతదేహాలు

కీవ్/మాస్కో/వాషింగ్టన్/ కౌలాలంపూర్: రెండు దేశాల ఆధిపత్య పోరులో 295 మంది అమాయక ప్రయాణికులు బలయ్యారు. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేశారు. రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలు, రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతంలో.. ఆ విమానం కూలిపోయింది. ఘటనలో విమానంలో ఉన్న 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది.. మొత్తం 295 మంది మరణించారు. పేల్చివేతపై ఇప్పటివరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. కానీ ఉక్రెయిన్ దళాలే పేల్చేశాయని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పేర్కొంటుండగా.. అది తిరుగుబాటుదారుల పనేనంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.

ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నాలుగు నెలల క్రితం హిందూ మహాసముద్రంలో అంతు చిక్కని రీతిలో అదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన ఘటనను మరచిపోకముందే ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఈ రెండు విమానాలు మలేసియన్ ఏర్‌లైన్స్‌కు చెందినవే కావడం గమనార్హం. సమాచారం అందగానే హుటాహుటిన అత్యవసర సహాయ దళాలు ఘటనాప్రాంతానికి బయల్దేరాయని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనను విమాన విపత్తుగా పేర్కొన్న ఉక్రెయిన్ ప్రధానమంత్రి వెంటనే విచారణకు ఆదేశించారని సమాచారం. విమానం కూలిపోయిన ప్రాంతంలో 22 మృతదేహాలను లెక్కించినట్లు ఘటనాస్థలానికి చేరిన జర్నలిస్ట్ ఒకరు తెలిపారు.
 
10 కిమీల ఎత్తున
మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 ప్యాసెంజర్ విమానం గురువారం సాయంత్రం ఉక్రెయిన్‌లోని, సంక్షోభ ప్రాంతమైన దొనెస్క్‌లో ఉన్న షక్తర్క్ పట్టణ పరిసరాల్లోకి రాగానే రాడార్ సంకేతాలకు దూరమైంది. అది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతం. ఆ సమయంలో ఆ విమానం ఉక్రెయిన్ గగనతలంపై 30 వేల అడుగుల (దాదాపు 10 కిమీల) ఎత్తున ఉంది. దీన్ని భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణితో పేల్చేశారని భావిస్తున్నారు. కాలిపోతు న్న శకలాలు, మృతదేహాలు రష్యా సరిహద్దుకు 40 కిమీల దూరంలోని గ్రబావొ గ్రామ సమీపంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
 
మీరంటే మీరు..
గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌కు చెందిన పలు మిలటరీ విమానాలను రష్యా అనుకూల తిరుగుబాటు దారులు పేల్చేస్తున్నారు. బుధవారం కూడా తమ యుద్ధవిమానాన్ని పేల్చేశారని ఉక్రెయిన్ ప్రకటించింది. తిరుగుబాటుదారులకు రష్యా అన్నిరకాలుగా సహకరిస్తోందని, అత్యాధునిక క్షిపణులను వారికి అందిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ సాయుధ దళాలు గగన లక్ష్యాలపై ఎలాంటి దాడులు చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకొ తన అధికారిక వెబ్‌సైట్లో ప్రకటించారు. ఉక్రెయిన్ వైమానిక దళమే మలేసియా ప్యాసెంజర్ విమానాన్ని పేల్చేసిందని తిరుగుబాటుదారుల నేత అలెక్జాండర్ బొరొదాయి ఆరోపించారు. విమాన ప్రమాద వార్త వినగానే షాక్‌కు గురయ్యానని, దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించానని మలేసియా ప్రధానమంత్రి నజిబ్ రజాక్ ప్రకటించారు.
 
ఒబామా ఆరా
విమాన ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆరా తీశారు. రష్యాపై అమెరికా తాజాగావిధించిన ఆంక్షల విషయంపై ఫోన్‌లో మాట్లాడుతూ.. ప్రమాద విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాగా, ప్రమాద ఘటనపై జాతీయ భద్రత బృందం ఒబామాకు వివరాలందించింది.
 
గురువారం సాయంత్రం ఎప్పుడేం జరిగింది..
7:45:     ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్17(బోయింగ్ 777 రకం)తో రాడార్ సంబంధాలు తెగిపోయాయి. మొత్తం 295 మందీ చనిపోయి ఉంటారని రష్యన్ వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ వెల్లడించింది.
7.45:    ఉక్రెయిన్ గగనతలంలో తమ విమానంతో సంబంధాలు కోల్పోయినట్లు మలేసియా ఎయిర్‌లైన్స్ సంస్థ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.
7.45:    విమానం 33వేల అడుగుల ఎత్తులో వెళుతుండగా భూమిపై నుంచి మిసైల్‌తో కూల్చేశారని ఉక్రెయిన్ హోంమంత్రికి సలహాదారుడు ఆంటన్ గెరాషెంకో తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు.
7.46:    మీడియా కథనాలు తమ దృష్టికి వచ్చాయని, సమాచారం సేకరిస్తున్నామని బోయింగ్ కంపెనీ ప్రకటించింది.
7.49:    మలేసియా విమాన ప్రమాదంపై వెంటనే దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రధాని ప్రకటించారు.
7.50:    మలేసియా విమానం కూల్చివేతలో ఉక్రెయిన్ రక్షణ దళాల ప్రమేయం లేదని ఆ దేశాధ్యక్షుడిని ఉటంకిస్తూ ఇంటర్‌ఫ్యాక్స్ వార్తా సంస్థ కథనం.
7.50:    దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలో విమాన శకలాలు పడ్డాయని, దాదాపు వంద వరకు చిధ్రమైన మృతదేహాలు కనిపిస్తున్నట్లు ఘటనా స్థలానికి వెళ్లిన ఎమర్జెన్సీ సహాయక బృందం వెల్లడి.
7.50:    అమెరికా అధ్యక్షుడు ఒబామాకు విషయం తెలిసినట్లు వైట్‌హౌజ్ ప్రకటన
7.53:    తక్షణ దర్యాప్తునకు ఆదేశించిన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్
7.57:    ఉక్రెయిన్ ప్రభుత్వమే విమానాన్ని కూల్చివేసిందని అక్కడి వేర్పాటువాద నేత అలెగ్జాండర్ బోరోదోయ్ ఆరోపణ. ఖండించిన ప్రభుత్వ వర్గాలు.
7.57:    ఘటనపై ఉక్రెయిన్ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరపాలని సీనియర్ అమెరికన్ అధికారులను ఆదేశించిన ఒబామా
8.04:    మలేసియా విమానాన్ని రెబెల్స్ కూల్చివేశారని    ఉక్రెయిన్ సర్కారు ఆరోపణ
8.04:    ఈ ఘటనపై ఒబామాతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చించినట్లు ఆ దేశ వార్తా సంస్థ వెల్లడి
8.07:    మృతులకు బోయింగ్ కంపెనీ సంతాపం. అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement