నా శీలాన్ని దోచేసి... వదిలేసింది
న్యాయం చేయండి
పోలీసులను ఆశ్రయించిన యువకుడు
సహజీవనం చేసి, ఇప్పుడు కాదంటోందంటూఆరోపణ
బెంగళూరు : నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నాతో శారీరక సంబంధం కొనసాగించి గర్భం దాల్చింది. ఇప్పుడు నన్ను కాదంటోంది. శీలం కోల్పోయిన నేను వేరొకరిని ఎలా వివాహం చేసుకోవాలి. న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడో బాధితుడు. వివరాల్లోకి వెళ్లితే... తుమకూరు జిల్లా బెళ్లావి తాలూకాకు చెందిన శివకుమార్ రెండేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రెండు నెలలుగా సదరు యువతి అతడికి దూరంగా ఉంటోంది. దీంతో రెండు రోజుల
ముందు శివకుమార్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. మొదట్లో వద్దంటున్నా యువతి నాపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రేమించేలా చేసింది. అటుపై నేను తప్పని చెబుతున్నా బలవంతంగా నాతో శారీరక సంబంధం కొనసాగించింది. అంతేకాకుండా గర్భవతి కూడా అయింది. అటుపై ఆమె తల్లిదండ్రులు నన్ను బెదిరించి రూ. 30 వేలు తీసుకుని ఆమెకు గర్భప్రావం చేయించారు.
అటుపై కూడా నాతో సంబంధం కొనసాగించింది. ఆమె బాగోగులు కోసం నేను రూ. 5 లక్షల వరకూ ఖర్చు చేశాను. కొంత కాలంగా నా నుంచి దూరంగా ఉంటోంది. ఆమె తల్లిందండ్రులు యువతిని హాసన్లో ఉంచారని తెలుసుకుని అక్కడకు వెళ్లి గాలించిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పోయినందుకు నాకు బాధ లేదు. ఇప్పుడు నా శీలం పోయింది. మరొకరిని ఎలా పెళ్లి చేసుకోవాలి. ఈ విషయమై యువతిపై రేప్ కేసు పెట్టండంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసులు మాత్రం ఈ తరహా కేసులు నమోదు చేయలేమని చేతులెత్తేశారు. దీంతో బాధితుడు సోమవారం మీడియాను ఆశ్రయించారు. ప్రేమ పేరుతో మోస పోయిన ఘటనలో మహిళలు తాము అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదు చేసే కేసు నమోదు చేసుకునే పోలీసులు... పురుషుల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు నా శీలాన్ని ఆమె దోచుకుంది. నాకు న్యాయం చేయండి. ఆ యువతిపై అత్యాచారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. లేదా ఆమెతో నాకు వివాహం జరిపించండి అని మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశాడు.