
మూన్‌పై మట్టి కోసం శాటిలైట్ ట్రాక్టర్లు
మూన్ ఎక్స్‌ప్రెస్ జాబిల్లిపై ఉన్న వనరులను వాడుకునేందుకు సిద్ధమవుతోంది.
చందమామ.. మన ఎనిమిదో ఖండం! అక్కడ మనుషులు లేరు.. పైగా మనకు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది... మరి అదెలా అవుతుంది మరో ఖండం? డౌట్లేమీ వద్దు. ఈరోజు కాకపోతే రేపైనా.. మన సహజ ఉపగ్రహంపై మనుషులు చేరడం గ్యారంటీ.. అంతకుముందే.. అక్కడి సహజ వనరులన్నింటినీ మన అవసరాల కోసం వాడుకోవడమూ గ్యారంటీ అంటోంది మూన్ ఎక్స్‌ప్రెస్!
అమెరికాలోని ఫ్లారిడాకు చెందిన కంపెనీ మూన్ ఎక్స్‌ప్రెస్ జాబిల్లిపై ఉన్న వనరులను వాడుకునేందుకు సిద్ధమవుతోంది. పక్క ఫొటోల్లో కనిపిస్తున్నవి ఆ ప్రయత్నాల్లో భాగంగా తయారు చేయాలని అనుకుంటున్న అంతరిక్ష నౌకలు.. ఎంక్స్–5 డిస్కవరీ క్లాస్ ఎక్స్‌ప్లోరర్లు. జాబిల్లిపై బోలెడంత హీలియం –3, సిలికాన్ వంటి విలువైన ఖనిజాలున్నాయని.. వాటిని మన అవసరాలకు వాడుకోవచ్చని చాలాకాలంగా అనుకుంటున్నదే. కాకపోతే ఇప్పటివరకూ అ దిశగా ప్రయత్నం జరగలేదు. గూగుల్ సంస్థ లూనార్ ఎక్స్ ప్రైజ్ పేరుతో కొన్నేళ్ల క్రితం జాబిల్లిపై ఉండే వనరులను వాడుకునేందుకు తగిన ప్రణాళికను రూపొందించిన వారికి రెండు కోట్ల డాలర్ల బహుమతి ప్రకటించింది. ఈ పోటీలో విజయం సాధించే స్థితిలో ఉన్న మూన్ ఎక్స్‌ప్రెస్ ఈ మధ్యే తాను ఏం చేయాలనుకుంటున్నదీ వివరించింది.
జాబిల్లిపై మైనింగ్‌కు ముందుగా తాము రెండు అంతరిక్ష నౌకలను ప్రయోగిస్తామని తెలిపింది. ఈ ఏడాది చివరలో జరిగే తొలి.. వచ్చే ఏడాది జరిగే మలి ప్రయోగాల ద్వారా అక్కడి పరిస్థితులను అంచనా వేస్తామని... 2020లో హార్వెస్ట్ మూన్ ప్రయోగంతో అక్కడి రాతి నమూనాలను సేకరించి భూమ్మీదకు తీసుకొస్తామని తెలిపింది. రాతి నమూనాలు మోసుకొచ్చేందుకు వ్యోమగాములెవరూ అవసరం లేదని... ఎంఎక్స్–5 డిస్కవరీ క్లాస్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా అక్కడికి చేరుకుని.. యంత్రాల సాయంతోనే నమూనాలు సేకరిస్తామని.. ఆ తరువాత ఎంక్స్–1ఈ ల్యాండర్ ద్వారా వాటిని భూమ్మీదకు చేరుస్తామని ప్రకటించింది మూన్ ఎక్స్‌ప్రెస్. జాబిల్లిపై అంతరిక్ష నౌకలను ల్యాండ్ చేసేందుకు ఈ కంపెనీ ప్రభుత్వ అనుమతులు కూడా సాధించిందండోయ్!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్