లండన్ టెర్రర్ అటాక్: భారతీయులు సేఫ్!
న్యూఢిల్లీ: బ్రిటన్ పార్లమెంటు లక్ష్యంగా బుధవారం జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయ బాధితులు ఎవరూ లేనట్టు తెలుస్తున్నదని విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. లండన్‌లో జరిగిన ఈ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.
కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న లండన్‌పై ఓ ఉగ్రవాది విరుచుకుపడ్డాడు. థేమ్స్ బ్రిడ్జిపై కారుతో బీభత్సం సృష్టించి.. సమీపంలోని పార్లమెంట్‌ను టార్గెట్ చేశాడు. బ్రిడ్జిపై కారును వేగంగా నడిపి ఇద్దరిని పొట్టనబెట్టుకొని.. పార్లమెంట్ భవనం వద్దా ఓ పోలీసు అధికారిని కత్తితో పొడిచి చంపాడు. చివరికి పోలీసుల కాల్పుల్లో అతడు హతమయ్యాడు. బుధవారం పార్లమెంటులో సమావేశాలు జరుగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.
ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మా ట్విట్టర్‌లో స్పందించారు. 'లండన్‌లోని భారత హైకమిషన్‌తో నేను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను. లండన్ దాడుల్లో భారతీయులు ఎవరూ గాయపడలేదని ఇప్పటివరకు అందిన నివేదికలను బట్టి తెలుస్తున్నది' అని సుష్మా ట్వీట్ చేశారు.
I am in constant touch with Indian High Commission in London. There is no Indian casualty reported so far. #LondonAttack @HCI_London
— Sushma Swaraj (@SushmaSwaraj) 22 March 2017