
హెలికాప్టర్ కూలి.. ఇద్దరు రాయబారుల మృతి
పాకిస్థాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఫిలిప్పీన్స్, నార్వే రాయబారులతో సహా ఆరుగురు మరణించారు. మొత్తం 11 మంది విదేశీయులు ప్రయాణిస్తున్న ఆ హెలికాప్టర్ పాకిస్థాన్లోని గిలిగిట్-బాల్తిస్తాన్ ప్రాంతంలో కూలిపోయినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. నార్వే రాయబారి లీఫ్ హెచ్ లార్సెన్, ఫిలిప్పీన్స్ రాయబారి డోమింగో డి లుసెనారియో జూనియర్ ఈ ప్రమాదంలో మరణించారు. వాళ్లతో పాటు.. మలేసియా, ఇండోనేసియా రాయబారుల భార్యలు కూడా ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ నడుపుతున్న ఇద్దరు ఆర్మీ పైలట్ల ప్రాణాలు సైతం పోయాయి. ఆరుగురు పాకిస్థానీలు, 11 మంది విదేశీయులు ఉన్న ఆ హెలికాప్టర్.. నల్తార్ వ్యాలీ ప్రాంతంలోని ఓ పాఠశాల భవనంపై కూలిపోయింది. పోలండ్, డచ్ రాయబారులు గాయపడ్డారని సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ సలీమ్ బాజ్వా తెలిపారు.
ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గిలిగిట్-బాల్తిస్థాన్ ప్రాంతంలో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండటంతో.. దానికి హాజరయ్యేందుకు ఈ ప్రతినిధులందరినీ మూడు ఎంఐ-17 హెలికాప్టర్లలో తరలిస్తున్నారు. వాటిలో రెండు సురక్షితంగానే ల్యాండయినా, మూడోది మాత్రం కుప్పకూలి.. దానికి నిప్పంటుకుందని బాజ్వా చెప్పారు. మరణించినవారిలో ముగ్గురు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే హెలికాప్టర్ ఎందుకు కూలిందో కూడా ఇంకా స్పష్టం కాలేదు.
విదేశీ రాయబారులు పాకిస్థాన్లో జరిగిన ప్రమాదాల్లో మరణించడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో 1998లో నాటి సైనిక పాలకుడు జనరల్ జియా ఉల్ హక్ విమాన ప్రమాదంలో మరణించినప్పుడు.. అదే ప్రమాదంలో పాకిస్థాన్లోని అమెరికా రాయబారి ఆర్నాల్డ్ రఫెల్ కూడా మరణించారు.