ప్రాణం ఖరీదు రూ. 150! | Patient dies in Erragadda chest hospital | Sakshi
Sakshi News home page

ప్రాణం ఖరీదు రూ. 150!

Published Wed, Mar 15 2017 3:03 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

(కృష్ణ భార్య, పిల్లలు- ఇన్‌సెట్‌ వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన కృష్ణ)

(కృష్ణ భార్య, పిల్లలు- ఇన్‌సెట్‌ వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన కృష్ణ)

- ఆక్సిజన్‌ కోసం లంచమడిగిన అటెండర్‌
- పైసల్లేక పోవడంతో ఆగిన ఊపిరి
- ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో దారుణం


హైదరాబాద్‌

సోమవారం అర్ధరాత్రి.. ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి.. తీవ్రమైన ఆస్తమాతో అక్కడ చికిత్సపొందుతున్న కృష్ణనాయక్‌ అస్వస్థతకు గురయ్యాడు.. ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్నాడు.. అది గమనించిన అతని భార్య డ్యూటీలోని సిబ్బంది వద్దకు వెళ్లింది.. వెంటనే ఆక్సిజన్‌ పెట్టాలన్న సిబ్బంది అందుకు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. తన దగ్గర డబ్బు లేదని, ఆక్సిజన్‌ పెట్టాలని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు.

దీంతో కొద్దిసేపటికే కృష్ణ మృతి చెందాడు. ప్రాణాలు నిలబెట్టాల్సిన ప్రభుత్వాస్పత్రుల సిబ్బంది లంచాల దురాశతో ప్రాణాలు తోడేసిన వైనమిది. దీనిపై పలువురు రోగులు, వారి బంధువులు మంగళవారం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడంతో.. ఇద్దరు సిబ్బందిని అధికారులు సస్పెండ్‌ చేశారు.

ఆస్పత్రిలోకి వచ్చినప్పటి నుంచీ..
మహబూబ్‌నగర్‌ జిల్లా లింగాల మండలం రాయారం గ్రామానికి చెందిన వడ్త్యా కృష్ణనాయక్‌కు భార్య కవిత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తీవ్ర ఆస్తమాతో బాధపడుతున్న కృష్ణను కవిత సోమవారం ఉదయం ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) విభాగం వద్దకు కూడా వెళ్లలేని స్థితిలో కృష్ణ ఉండటంతో కవిత వెళ్లి స్లిప్‌ (చీటీ) రాయాలని కోరింది. కానీ రోగిని తీసుకొస్తే తప్ప ఓపీ చీటీ ఇవ్వబోమనడంతో.. అతికష్టంగా ఓపీ కౌంటర్‌ వద్దకు తీసుకెళ్లింది. కృష్ణను పరీక్షించిన వైద్యులు ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు. ఊపిరి సరిగా తీసుకోలేకపోతుండటంతో ఆక్సిజన్‌ పెట్టారు. రాత్రి విధులకు వచ్చిన నళిని అనే వైద్యురాలు కూడా కృష్ణనాయక్‌ను పరీక్షించి.. ఆక్సిజన్‌ అందుతూనే ఉండేలా చూడాలని డ్యూటీ నర్స్‌ రీటాకు, అటెండర్లకు సూచించారు. కానీ కొద్దిసేపటి తర్వాత అంతా బాగానే ఉందంటూ నర్సు, అటెండర్‌ ఆక్సిజన్‌ సరఫరాను తీసేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఊపిరి అందక కృష్ణనాయక్‌ ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇది చూసిన కవిత పరిగెత్తుకుంటూ నర్సు రీటా వద్దకు వెళ్లి చెప్పింది. కానీ ఆమె రాలేదు. మళ్లీ వెళ్లి అడగడంతో పదే పదే రావద్దంటూ బెదిరించి, వెళ్లగొట్టింది.

కాళ్లావేళ్లా పడినా..
నర్సు రాకపోవడంతో ఆందోళనగా ఉన్న కవిత వద్దకు అటెండర్‌ నయీమ్‌ వచ్చాడు. డబ్బులు ఇస్తే ఆక్సిజన్‌ అందజేస్తానని చెప్పాడు. ఆలస్యమైతే కృష్ణ చనిపోతాడనీ బెదిరించాడు. తన వద్ద డబ్బులు లేవంటూ కన్నీరు మున్నీరైన కవిత.. తన భర్తను కాపాడాలని వేడుకుంది. అయినా నర్సుగానీ, అటెండర్‌గానీ స్పందించలేదు. తన భర్త పరిస్థితిని చూసి ఆందోళనకు గురైన కవిత మరోసారి వెళ్లి కాళ్లావేళ్లా పడింది. అయినా వారు కవితను తిట్టి పంపించేశారు. దీం ఏడుస్తూ ఆమె బెడ్‌ వద్దకు వచ్చే సరికి కృష్ణనాయక్‌ ప్రాణాలు విడిచాడు.

ఆందోళన చేయడంతో..
భర్త మరణించడాన్ని చూసిన కవిత పెద్ద పెట్టున రోదించింది. ఇదంతా గమనిస్తున్న పక్క బెడ్‌ల మీద ఉన్న రోగులు, వారి బంధువులు నర్సును, అటెండర్‌ను నిలదీశారు. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో కృష్ణకు ఆక్సిజన్‌ అందించలేదని, నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారంటూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆందోళనకు దిగారు. దీంతో నర్సు, అటెండర్‌ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. చివరికి డ్యూటీ డాక్టర్, ఇతర సిబ్బంది వచ్చి ఉదయం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో రోగులు, బంధువులు వెనక్కి తగ్గారు. మంగళవారం ఉదయం మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి మృతుడి బంధువులు ఛాతీ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. కృష్ణ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సూపరింటెండెంట్‌ నిర్లక్ష్యం కూడా..
ఆక్సిజన్‌ అందించక కృష్ణ మృతిచెందిన విషయం తెలిసినా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మంగళవారం ఉదయం వరకు అక్కడికి రాలేదు. పైగా ఆస్పత్రిలో రోగులు ఆందోళన చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో పోలీసులు ఆస్పత్రికి వచ్చి ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బంధువులు కృష్ణ మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు.

ఇద్దరు ఉద్యోగులపై వేటు
కృష్ణనాయక్‌ భార్యను లంచం డిమాండ్‌ చేసిన నయీమ్‌ అనే అటెండర్‌ను, ఔట్‌పేషెంట్‌ బ్లాక్‌ వద్ద దురుసుగా ప్రవర్తించిన ధన్‌రాజ్‌ అనే మరో ఉద్యోగిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఆర్‌ఎంవో డాక్టర్‌ నరేందర్‌ తెలిపారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సు రీటాపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement