'నా భార్యను ముద్దు పెట్టుకోనీయడం లేదు' | Pensioner in legal battle to be allowed to kiss his wife of 67 years | Sakshi
Sakshi News home page

'నా భార్యను ముద్దు పెట్టుకోనీయడం లేదు'

Published Tue, Jun 23 2015 9:15 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

'నా భార్యను ముద్దు పెట్టుకోనీయడం లేదు'

'నా భార్యను ముద్దు పెట్టుకోనీయడం లేదు'

లండన్: ‘నా ఇష్టమున్నంత సేపు నా భార్యను ముద్దు పెట్టుకోనీయడం లేదు. కేవలం రెండు క్షణాల పాటే ముద్దు పెట్టుకోవాలట. అది కూడా రెండంటే రెండు సార్లేనట. ఆమెతో మనసువిప్పి మాట్లాడనీయడం లేదు. ఆమె పక్క సర్దనీయడం లేదు. ఆమెకు ఎలాంటి సేవలు చేయనీయడం లేదు. పండగకో, పబ్బానికో ఆమెను నా ఇంటికి  పంపకపోయినా ఫర్వాలేదు. కనీసం ఆమె పుట్టిన రోజునాడైనా  నా ఇంటికి పంపించడం లేదు. కేర్ హోంలో వున్న నా భార్యను చూడడానికి వెళ్లినప్పుడల్లా కేర్ హోం సిబ్బంది నా పక్కనే ఉంటున్నారు. నేనేమీ మాట్లాడుతున్నానో రాసుకుంటున్నారు. నాకెలాంటి ప్రైవసీ కల్పించడం లేదు. అక్కడున్నంత సేపు నాకు జైల్లో ఉంటున్నట్టు ఉంది. ఇక నేనెందుకు బతకాలో నాకర్థం కావడం లేదు’ అని భార్యంటే పంచ ప్రాణాలుగా భావించే ఓ భర్త ఆవేదన ఇది.

లండన్‌లోని డెర్బీ సిటీలో నివసిస్తున్న థామస్ మిడిల్‌టన్ ఆక్రందన ఇది. మానవ హక్కుల పేరిట తనకు కలిగిస్తున్న బాధను న్యాయపోరాటం ద్వారానే ఎదుర్కోవాలని సిద్ధపడ్డ ఓ 87 ఏళ్ల తాతయ్య కన్నీటి గాధ ఇది. ఈ తాతయ్య భార్య జాన్‌కు ప్రస్తుతం 84 ఏళ్లు. పెళ్లయిన నాటి నుంచి ఈ దంపతులు ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా బతకలేదు. 2010లో ఆమెకు డిమెన్షియా, పార్కిన్సన్ అనే మెదడు సంబంధిత వ్యాధులు వచ్చాయి. ఆమెకు ఎవరిని గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది. వారికి ముగ్గురు పిల్లలు. వారు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిపోయారు. అప్పటి నుంచి రోగగ్రస్థురాలైన భార్యను తానే చూసుకుంటూ వచ్చాడు తాతయ్య. 

పెన్షనరైన తాతయ్య ఈ వయస్సులో భార్యను సరిగ్గా చూడలేడని భావించిన డెర్బీ సిటీ కౌన్సిల్ సిబ్బంది వచ్చి ఆమెను 2010, సెప్టెంబర్ 4వ తేదీన కేర్ హోంకు తరలించారు. అప్పటి నుంచి తాతయ్య ప్రతి రోజు పొద్దున్నే కేర్ హోంకు వెళ్లడం, రాత్రి వరకు ఆమెతో గడిపి తిరిగి రావడం పరిపాటిగా మారిపోయింది. తాతయ్య గంటల తరబడి భార్యను ముద్దు పెట్టుకుంటున్నాడని, ఆమె ఇబ్బంది ఫీలవుతున్నదని కేర్ హోం యాజమాన్యం సిటీ కౌన్సిల్ కోర్టుకు ఫిర్యాదు చేసింది.

దీనికి స్పందించిన కోర్టు 2012లో  తాతయ్యపై ఆంక్షలు విధించింది. కేర్ హోంకు వెళ్లినప్పుడు భార్యను చూసి రావాలే తప్ప ఆమెను ముద్దు పెట్టుకోకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. డిమెన్షియా, పార్కిన్సన్ వ్యాధులతో బాధ పడుతున్నందున ఆమె తన నిర్ణయం తాను తీసుకోలేని పరిస్థితిలో ఉన్నందున, ఆమె పట్ల ఏ విధంగా ప్రవర్తించినా అది ఆమె మానవ హక్కులను కాలరాయడమే అవుతుందని ఆ ఉత్తర్వుల్లో కోర్టు హెచ్చరించింది. దీంతో హతాషుడైన తాతయ్య ‘క్రౌండ్ ఫండ్’ వెబ్‌సైట్ విరాళాల ద్వారా కోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారు. కోర్టు కేసు కొట్లాటకు కావాల్సిన కరెన్సీ లేకపోవడం వల్ల కేసు విచారణ మధ్యలోనే తాతయ్య రాజీకీ రావాల్సి వచ్చింది.

రాజీలో భాగంగా సిటీ కౌన్సిల్ కోర్టు 2014, ఆగస్టు నెలలో తాతయ్యకు ఓ ఎనిమిది అంశాల ప్రవర్తనా నియమావళిని నిర్దేశించింది. రోజుకు రెండు గంటలకు మించి భార్య పక్కన ఉండరాదని, కేర్ హోం సిబ్బంది పక్షంలోనే భార్యను కలుసుకోవాలని, వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు రెండు సార్లు, రెండు క్షణాలపాటు మాత్రమే ఆమెను ముద్దు పెట్టుకోవాలని ఆ నియమావళిలో పేర్కొంది. అప్పటి నుంచి తాతయ్య మానసిక ఆందోళన పెరుగుతూ వచ్చింది. భార్యను కేర్ హోంలో ఉంచాల్సిన అవసరమే లేదని, ఇంటికి పంపిస్తే తానే చూసుకుంటానని మొరపెట్టుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. దీనికన్నా తాను చచ్చిపోవడమే మేలని బాధ పడుతున్న తాతయ్య కథ తెలిసి ఓ ఎన్జీవో సంస్థ రంగ ప్రవేశం చేసింది.

తాతయ్య తరఫున కౌన్సిల్ కోర్టు ఉత్తర్వులపైనా అప్పీల్ చేసింది. కేసుపై తీర్పు వెలువడితే మానవ హక్కుల ఉల్లంఘనకు సరైన భాష్యం వస్తుందని తాను భావిస్తున్నానని తాతయ్య కాస్త సంతృప్తి వ్యక్తం చేశారు. తాతయ్య తన జీవితంలో భార్యను విడిచి ఒక్క క్షణం బతికిన సందర్భాలు తనకు తెలిసి లేవని, వారానికి ఐదు రోజులు భార్యను తీసుకొని డ్యాన్సింగ్ ఫ్లోర్‌కు వెళ్లేవాడని, ఇక ఒంటరి జీవితాన్ని గడపలేక పోతున్నాడని, తాతయ్యకు అనుకూలంగా తీర్పు వస్తుందని తాను భావిస్తున్నానని తాతయ్య అన్న డేవిడ్ (90) ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement