‘నోబెల్’ సాధిస్తే రూ.100 కోట్లు
♦ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన
♦ విజేతలకు ప్రభుత్వం తరపున నగదు పారితోషికం అందజేస్తాం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘‘ఒకప్పుడు చిన్నారుల వైజ్ఞానిక సమ్మేళనానికి(చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్) నాంది పలికిన శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ వేదికపై అందరి సమక్షంలో ఓ ప్రకటన చేస్తున్నా... ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాన్ని సాధించే తెలుగు శాస్త్రవేత్తలకు ప్రభుత్వం తరుపున రూ.100 కోట్ల నగదు పారితోషికాన్ని అందజేస్తాం. ఇప్పటివరకూ తెలుగువారు నోబెల్ బహుమతిని సాధించకపోవడం బాధగా ఉంది. అందుకే ఈరోజు అందరి సమక్షంలో చెబుతున్నా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అన్ని రంగాల్లో ప్రతిభ చూపే తెలుగు బిడ్డలు నోబెల్ ప్రైజ్ సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో బుధవారం చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉపకులపతి దుర్గాభవాని అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవంలో చంద్రబాబు ప్రసంగించారు.
త్వరలో విద్యార్థులకు క్లాస్ తీసుకుంటా..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 వేల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు త్వరలో తాను ఓ గంటపాటు క్లాస్ తీసుకునేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 1.50 కోట్ల కుటుంబాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌కు హాజరైన పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ... దురదృష్టవశాత్తూ దేశంలో సైన్స్‌పై ఫోకస్ తగ్గిందని అన్నారు. చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ సావనీర్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. యూనివర్సిటీలో నెలకొల్పేందుకు తయారు చేయించిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని నోబెల్ బహుమతి గ్రహీత టకాకి కజిటా వేదికపైనే ప్రారంభించారు.
‘నోబెల్’ సాధించడమెలాగో చెబుతారా?
‘‘ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతిని దక్కించుకోవాలంటే ఏం చేయాలి? ఏ విధంగా సాధించాలి? ఏమైనా మెలకువలు ఉంటే కాస్త మా పిల్లలకు చెప్పండి’’ ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత టకాకి కజిటాను కోరారు. బుధవారం తిరుపతిలో చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన సీఎం వివిధ స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు. మీలో ఎంత మంది నోబెల్ బహుమతి సాధిస్తారో చెప్పాలని సీఎం కోరగానే... వందలాది మంది చేతులెత్తారు. దీంతో సంబరపడ్డ చంద్రబాబు పక్కనే ఉన్న కజిటాను మైక్ దగ్గరకు రమ్మని కోరారు. ఆయన రాగానే చేతిలో మైక్ పెట్టి, నోబెల్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలని సరదాగా ప్రశ్నించారు. దీంతో కజిటా నవ్వుతూ... వర్క్ హార్డ్.. వర్క్ హార్డ్ అన్నారు. అవునా అంటూ తిరిగి మైక్ అందుకున్న సీఎం కష్టపడితే నోబెల్ ప్రైజ్ సాధించడం సాధ్యమేనని చెప్పారు. కాబట్టి మనం అందరం కష్టపడదామంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.