నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ | Sasikala first appearance to public after court verdict | Sakshi
Sakshi News home page

నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ

Published Tue, Feb 14 2017 11:20 PM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ - Sakshi

నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ

- తీర్పుపై స్పందించిన చిన్నమ్మ.. భావోద్వేగంలో కన్నీరు
- పోయెస్‌ గార్డెన్‌కు పోటెత్తిన అభిమానులు.. అక్కడే అరెస్ట్‌!


కువత్తూరు: సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించిన తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తొలిసారిగా మాట్లాడారు. కువత్తూరులోని గోల్డెన్‌ బే రిసార్ట్స్‌ నుంచి మంగళవారం రాత్రి పోయెస్‌గార్డెన్‌(చెన్నై)కు బయలుదేరిన ఆమె.. పార్టీ ఎమ్మెల్యేలు, మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా తనను అన్నాడీఎంకే నుంచి వేరుచేయలేదని, ఎక్కడ ఉన్నా నిరంతరం పార్టీ ఉన్నతికే పాటుపడతానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. 'ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా' అన్నారు.

'నాకు ఎదురైన సమస్య తాత్కాలికమైనదే. దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఇకపోతే, కష్టకాలంలో ఎమ్మెల్యేలంతా నా వెంట ఉండటం సంతోషకరం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇకపైనా ఇలానే ఉంటారన్న నమ్మకం ఉంది. నాపై కుట్రలు చేసినవారికి ఒక్కటే చెప్పదల్చుకున్నా.. ఏ శక్తి కూడా అన్నాడీఎంకే నుంచి నన్ను వేరుచేయలేదు'అని శశికళ అన్నారు. ఈ మాటలు మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికిగురై కన్నీరువిడిచారు. అక్రమ ఆస్తుల కేసులో శశికళ, ఆమె బంధువులైన సుధాకరన్‌, ఇళవరసిలు దోషులేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆమె కోరిక కలగా మిగిలిపోయింది. శశికళలోపాటు ఇద్దరు దోషులకు నాలుగేళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా పడింది.

పోయెస్‌ గార్డెన్‌ వద్ద ఉద్విఘన్నత.. లొంగుబాటు ఎప్పుడు..?
తక్షణమే దోషులు హైకోర్టులో లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా శశికళ లొంగుబాటుపై తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు ఆమెను కువత్తూరు రిసార్ట్స్‌లోనే అరెస్టు చేస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. మంగళవారం రాత్రికి ఆమె చెన్నై(పోయెస్‌ గార్డెన్‌)కి వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న వందలాది మంది అభిమానులు శశికళను చూడగానే కన్నీటిపర్యంతం అయ్యారు. కారు దిగి, అభిమానుల వద్దకు వెళ్లిన చిన్నమ్మ.. వారిని ఓదార్చేప్రయత్నం చేశారు. 'ఏడవొద్దు.. ధైర్యంగా ఉండండి.. ప్రజల కోసం పని చేయండి..'అని విజ్ఞప్తి చేశారు.

కాగా, తీర్పు కాపీలు అందిన వెంటనే కర్ణాటక పోలీసులు శశికళను అరెస్ట్‌ చేస్తారు. అది మంగళవారం అర్థరాత్రికా, బుధవారం ఉదయానికా అనేదానిపై సస్పెన్స్‌కొనసాగుతున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement