ఎస్పీకి గట్టి షాక్! అబ్బే!! అదేం లేదు..
- నరేశ్ అగర్వాల్ బీజేపీలోకి వెళతారంటూ పుకార్లు
- ఖండించిన ఎంపీ.. అఖిలేశ్‌తోనే ఉంటానని స్పష్టీకరణ
లక్నో: ఎన్నికల వేళ సోషల్ మీడియా వేదికగా కొందరు విపరీత ప్రచారానికి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరడంతో గెలుపు అవకాశాలు పెగిగాయని సంబరపడిపోతున్న సమాజ్‌వాదీ పార్టీకి గట్టి షాక్ తగిలిందని, ఎస్పీ వ్యవస్థాప సభ్యుల్లో ఒకరు, ప్రస్తుత ఎంపీ నరేశ్ అగర్వాల్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సోమవారం ఉదయం నుంచి వార్తలు వెలువడ్డాయి. కాంగ్రెస్‌తో ఎస్పీ ఎన్నికల పొత్తును నిరసిస్తూ అగర్వాల్ నేడో, రేపో బీజేపీలోకి చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో యూపీలో కలకలం చెలరేగింది. పార్టీ మారతారనే పుకార్లు వెలుగులోకివచ్చిన కొద్దిసేపటికే ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు.
"నేను బీజేపీలో చేరతాననే వార్తలు పూర్తిగా అబద్ధం. నాకా ఆలోచనలేనేలేదు. సమాజ్‌వాదీ పార్టీలోనే నా జీవితం కొనసాగుతుంది. అఖిలేశ్ నాయకత్వంలోనే పనిచేస్తా. బీజేపీని చిత్తుగా ఓడించడమే మా లక్ష్యం" అని నరేశ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తోన్న నరేశ్ అగర్వాల్.. ఎస్పీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత ఆప్తుడైన ఈ నేత.. మొన్నటి కుటుంబ పంచాయితీలో మాత్రం అఖిలేశ్ పక్షాన నిలబడ్డారు. (ఎస్పీ- కాంగ్రెస్ పొత్తు కుదిరింది..)
ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత కుమార్ విశ్వాస్‌పైనా ఇలాంటి పుకార్లే గుప్పుమన్నాయి. విశ్వాస్ బీజేపీలో చేరతారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చజరిగింది. అయితే అలాంటిదేమీలేదని క్లారిటీ ఇచ్చిన విశ్వాస్.. తనపై విషప్రచారం జరుగుతున్నదని ఆరోపించారు. 'మోదీ టీడీపీలోకి చేరతారా?' అని ఎదురు ప్రశ్నించారు. సోషల్ మీడియాను అతిగా వినియోగిస్తోన్న కాషాయ దళమే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నదని ప్రత్యర్థిపార్టీలు ఆరోపిస్తున్నాయి.