మృతుడు శ్రీనివాస్ కూచిభొట్ల
- అమెరికాలో కాల్పుల ఉదంతం.. జాతి వివక్ష కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు
- మృతుడు శ్రీనివాస్, గాయపడ్డ అలోక్‌రెడ్డి ఇద్దరూ హైదరాబాదీలే
- తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ అమెరికన్ ఘాతుకం
- వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలు
- కాల్పులు జరిపిన పూరింటన్ అరెస్ట్.. నేవీ మాజీ ఉద్యోగిగా గుర్తింపు
- విషాదంలో మునిగిపోయిన శ్రీనివాస్ కుటుంబం
- ఘటనపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ దిగ్భ్రాంతి..
‘మా ఉద్యోగాలు మాకే..’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన నినాదం వెర్రితలలు వేస్తోందా? గద్దెనెక్కాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు అమెరికాలో జాత్యహంకార భావజాలానికి మరింత ఊతమిస్తున్నాయా? కన్సాస్‌లో ఇద్దరు తెలుగు ఇంజనీర్లపై జరిగిన కాల్పుల ఘటన చూస్తుంటే ఇది నిజమేనని అన్పిస్తోంది! బార్‌లోకి వచ్చిన అమెరికన్.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ ఇంజనీర్లపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో అమెరికాలో ఉంటున్న భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
హ్యూస్టన్/వాషింగ్టన్/హన్మకొండ/ సాక్షి, హైదరాబాద్:
అమెరికాలో మళ్లీ విద్వేషపు తూటా పేలింది. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఆడమ్ పూరింటన్ అనే ఓ శ్వేతజాతి ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అనే ఇంజనీర్‌ను పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన పూరింటన్ అమెరికా నేవీ మాజీ ఉద్యోగి అని గుర్తించారు. ఘటన జరిగిన 5 గంటల్లోనే మిస్సోరి ప్రాంతంలోని ఓ బార్‌లో అతడిని అరెస్టు చేశారు.
మీరు నాకంటే ఎక్కువా..?
హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్, మేడసాని అలోక్‌రెడ్డి అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో ఉన్న ఓవర్‌ల్యాండ్ పార్క్‌లో నివసిస్తున్నారు. జీపీఎస్ వ్యవస్థలను తయారు చేసే గార్నిమ్ అనే సంస్థలో ఉద్యోగం నిర్వస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇద్దరూ కలసి బుధవారం రాత్రి అక్కడి ఒథాలే ప్రాంతంలోని ఆస్టిన్స్ బార్‌కు వెళ్లారు. కొంతసేపటి తర్వాత çపూరింటన్ అనే అమెరికన్ వారి వద్దకు వచ్చి వాదనకు దిగాడు. తాము (అమెరికన్లు) మేధావులమేనని, తమకు ప్రతిభ ఉన్నా విదేశాల వారి కారణంగా తమకు ఉద్యోగాలు రావట్లేదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మీరు మా ఉద్యోగాలను కాజేస్తున్నారు. తక్షణం అమెరికా విడిచివెళ్లిపోండి. ఉగ్రవాదులు.. మీరు నాకంటే ఎలా ఎక్కువ? అమెరికాలో ఎందుకుంటున్నారు, ఏం చేస్తున్నారు..’అంటూ గొడవకు దిగాడు. దీంతో శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలు బార్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడికి వచ్చిన బార్ మేనేజర్, సిబ్బంది పూరింటన్‌ను బయటికి పంపేశారు.
కొద్దిసేపటికే తిరిగొచ్చి..
బార్ నుంచి బయటికి వెళ్లగొట్టినా.. పూరింటన్ కొద్దిసేపటికి తుపాకీతో తిరిగి వచ్చాడు. ‘మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఉగ్రవాదులారా..’ అని అరుస్తూ శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలపై కాల్పులు జరిపాడు. శ్రీనివాస్ ఛాతీలో బుల్లెట్ దిగడంతో అక్కడే కుప్ప కూలిపోయారు. అలోక్‌కి తొడ భాగంలో తూటా దూసుకుపోయింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇయాన్ గ్రిలట్ అనే మరో అమెరికన్.. పూరింటన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో అతడి చేతిపై బుల్లెట్ గాయమైంది. వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా.. శ్రీనివాస్ అప్పటికే మరణించారు. అలోక్‌రెడ్డి, ఇయాన్ గ్రిలట్‌లు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక జాతి, మత విద్వేష నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ కాల్పుల ఘటన భారతీయ అమెరికన్లలో భయాందోళన నింపుతోంది. కాగా.. తమ ఏవియేషన్ ఇంజనీరింగ్ టీమ్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ కాల్పుల్లో మృతిచెందడం, అలోక్ గాయపడ్డం తమను కలచివేసిందని గార్మిన్ కంపెనీ తెలిపింది.
1.చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న అలోక్‌రెడ్డి
2.కుమారుడి మరణవార్త తెలిసి విలపిస్తున్న శ్రీనివాస్ తల్లిదండ్రులు
3.శ్రీనివాస్, అలోక్‌రెడ్డిపై కాల్పులు జరిగింది ఈ బార్‌లోనే..
శ్రీనివాస్ కుటుంబానికి వెల్లువలా సాయం..
శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ఆయన స్నేహితురాలు కవిప్రియ మథురమాలింగం సోషల్ మీడియాలో ఏర్పాటు చేసిన ‘గోఫండ్‌మి’పేజీ ద్వారా పలువురు అమెరికన్లు సహా దాదాపు 7,200 మంది 2,61,996 డాలర్ల (సుమారు రూ.కోటి 80 లక్షలు) సాయం అందించారు. శ్రీనివాస్ స్నేహశీలి అని, ఎవరినీ పల్లెత్తుమాట అనేవాడు కాదని అమెరికాలో ఆయన ఇంటి పొరుగువారు చెప్పారు.
1. ప్రణీత్ నేచర్స్ బౌంటీలోని శ్రీనివాస్ నివాసం 2. ఆర్‌కేపురంలోని అలోక్‌రెడ్డి నివాసం
పదేళ్ల కింద అమెరికా వెళ్లి..
అమెరికాలో మరణించిన శ్రీనివాస్ తండ్రి కూచిభొట్ల మధుసూదనరావు ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగి. వారు ఐదేళ్లుగా హైదరాబాద్ శివార్లలోని బాచుపల్లి మల్లంపేట గ్రామ పరిధిలో ఉన్న ప్రణీత్ నేచర్స్ బౌంటీ ఫేజ్–1లో నివసిస్తున్నారు. వారికి శ్రీనివాస్ తోపాటు పరశురామశాస్త్రి, సాయి కిశోర్ సంతానం. పరశు రామశాస్త్రి హైదరాబాద్‌లోనే స్థిరపడగా.. శ్రీనివాస్, సాయి కిశోర్ అమెరికాలో ఉంటున్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ శివార్లలోని విద్యా జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీ రింగ్ చదివారు. పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశారు. తొలుత అమెరికాలోని రాక్‌వెల్ కొలిన్స్ సంస్థలో సిస్టమ్స్ ఇంజనీర్‌గా పనిచేసి.. అనంతరం గార్నిమ్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరారు. శ్రీనివాస్‌కు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కే చెందిన సునయనతో వివాహం జరిగింది. వారికి ఇంకా సంతానం లేదు. శ్రీనివాస్ మరణవార్త విని వారి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.
స్నేహితుడితో కలసి..
అమెరికన్ కాల్పుల్లో గాయపడిన అలోక్ కుటుంబం హైదరాబాద్‌లోని చైతన్యపురి పరిధిలో ఉన్న ఆర్‌కే పురంలో నివసిస్తోంది. ఆయన తండ్రి మేడసాని జగన్మోహన్‌రెడ్డి, తల్లి రేణుక. వీరి స్వస్థలం వరంగల్ జిల్లా హన్మకొండలోని అడ్వొకేట్స్ కాలనీ. పదేళ్లుగా వారి కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోం ది. మిషన్ భగీరథ ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జగన్మోహన్‌రెడ్డికి ఇద్దరు కుమారులు అలోక్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి. అలోక్‌రెడ్డి హైదరాబాద్ లోని వాసవి కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కేషన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2006లో అమెరికా వెళ్లి మాస్టర్స్ డిగ్రీ చేశారు. శ్రీనివాస్‌తో కలసి రాక్‌వెల్ కొలిన్స్ సంస్థలో పనిచేసిన ఆయన.. తర్వాత శ్రీనివాస్ మాదిరిగానే గార్నిమ్ సంస్థలో చేరారు. ప్రస్తుతం కో–ఆర్డినేటర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలోక్‌రెడ్డికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య దీప్తి అమెరికాలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతి.
ఐదు గంటల్లోనే దుండగుడు అరెస్ట్.. ఎఫ్‌బీఐ దర్యాప్తు
శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్‌రెడ్డిలపై కాల్పులు జరిపిన జాత్యహంకారి పూరింటన్ (51)ను అమెరికా పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. పూరింటన్‌పై హత్య (ఫస్ట్ డిగ్రీ మర్డర్), హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. కాల్పుల ఘటన జరిగిన తర్వాత ఐదు గంటల్లోనే దుండగుడిని పట్టుకోవడం గమనార్హం. కాల్పుల ఘటన తర్వాత మిస్సోరీలోని క్లింటన్‌లో ఉన్న ఓ బార్‌లో దాక్కున్న పూరింటన్ తాను తూర్పుఆసియా వాసులిద్దరిని చంపానని అక్కడి ఉద్యోగితో చెప్పాడని అమెరికన్ స్థానిక మీడియా పేర్కొంది. కాల్పుల ఘటనపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటన వెనుక జాతి వివక్ష కోణం ఉందా, లేదా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నామని కన్సాస్ నగరంలోని ఎఫ్‌బీఐ ప్రతినిధి ఎరిక్ జాక్స్ వెల్లడించారు. ఈ దుర్ఘటన జరిగిన బార్‌ను నిరవధికంగా మూసివేశారు.
దుండగుడు అమెరికన్ నేవీ మాజీ ఉద్యోగి!
కాల్పులు జరిపిన పూరింటన్ అమెరికా నావికాదళం మాజీ ఉద్యోగి అని స్థానిక మీడియా వెల్లడించింది. అతడి వద్ద పైలట్ లైసెన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని తెలిపింది. అతను ఒథాలేలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేశాడని, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ పనిచేసి 2010లో బయటికొచ్చాడని పేర్కొంది.
మానవత్వమున్న మనిషిని..
దుండగుడిని అడ్డుకున్న అమెరికన్‌పై ప్రశంసలు
కాల్పులు జరిపిన పూరింటన్‌ను ప్రాణాలకు తెగించి అడ్డుకున్న 24 ఏళ్ల అమెరికన్ యువకుడు ఇయాన్ గ్రిలట్‌కు ప్రశంసలు లభిస్తున్నా యి. ఒక అమెరికన్ జాతి విద్వేషంతో కాల్పులు జరపగా.. మరో అమెరికన్ మానవత్వంతో అడ్డుకోవడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. పూరింటన్ కాల్పులు మొదలుపెట్టడంతో టేబుల్ వెనక దాక్కున్న గ్రిలట్.. ఒక్కసారిగా విసురుగా వెళ్లి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడు అతడిపైనా కాల్పులు జరపడంతో.. గ్రిలట్ చేతి గుండా ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆస్పత్రిలో గ్రిలట్‌ను యూనివర్సిటీ ఆఫ్ కన్సాస్ హెల్త్ సిస్టమ్ ఇంటర్వూ్య చేసింది. అందు లో.. ‘సాటి మనిషి కోసం నేనేం చేయాలో అదే చేశాను. అతడు (బాధితుడు) ఎక్కడి వాడు, ఏ జాతి వాడదన్నది ముఖ్యం కాదు. మనమంతా మనుషులం. దుండగుడు మరొకరి వైపు వెళ్లకుండా ఏం చేయాలో అది చేశాను’ అని గ్రిలట్ పేర్కొన్నారు.
శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం: కాల్పుల ఘటనపై సుష్మ దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో తెలుగువారిపై జాతి విద్వేష కాల్పుల పట్ల విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సర్నాతో మాట్లాడానని, అక్కడి అధికారులు కన్సాస్‌కు చేరుకున్నారని ట్విటర్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. కన్సాస్‌లో కాల్పులను ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని రాయబార కార్యాలయ అధికారి మ్యారికే కార్లసన్∙ పేర్కొన్నారు. కాగా, అమెరికాలో జాత్యహంకార దాడుల పట్ల సీపీఐ ఆందోళన వ్యక్తం చేసింది. జాత్యహంకారం, ట్రంప్ విధానాలపై పోరాడాలని అమెరికాలోని ప్రజాస్వామ్య శక్తులకు విన్నవించింది.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్‌లో దుండగుడు ఇద్దరు తెలుగు విద్యార్థులపై కాల్పులు జరపడం, ఈ ఘటనలో ఒకరు మరణించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కాల్పుల ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల అనే విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అలోక్ మేడసాని అనే విద్యార్థి గాయపడ్డారు. కన్సాస్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలోక్‌కు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి: కృష్ణమోహన్, శ్రీనివాస్ బంధువు
‘‘ఇప్పటికే అమెరికాలో నలుగురు జాత్యహంకార దాడుల్లో చనిపోయారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి. శ్రీనివాస్ మృతదేహాన్ని మూడు, నాలుగు రోజుల్లో రప్పించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారు..’’
తెలుగు ప్రజలు కలసికట్టుగా ఉండాలి: జగన్మోహన్‌రెడ్డి, అలోక్‌రెడ్డి తండ్రి
‘‘అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలంతా కలసికట్టుగా ఉండాలి. అమెరికా వాళ్లు పిచ్చివాళ్లలా మారిపోతున్నారు. ఏ విషయమైనా వారితో వాదించవద్దు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. భారత యువత పునరాలోచన చేసుకుని స్వదేశానికి తిరిగి రావాలి..’’
సంబంధిత వార్తా కథనాలకై చదవండి..
(జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..)
(‘కూచిబొట్ల’కు కొండంత అండ)
శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి
అమెరికాలో జాతి విద్వేష కాల్పులు
శ్రీనివాస్ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట