లాలూ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: పశువుల దాణా కుంభకోణం కేసుల్లో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థ సీబీఐ వేసిన కేసుల్లో తాజా విచారణను సైతం ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. లాలూపై అభియోగాలను జార్ఖండ్ హైకోర్టు కిట్టివేయడాన్ని సవాలు చేస్తూ దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
సోమవారం సుప్రీంకోర్టు పనివేళలు ప్రారంభమైన కొద్ది సేపటికే జస్టిస్ అమితావ్ రాయ్, జస్టిస్ పీసీ ఘోష్‌లతో కూడిన ధర్మానం తీర్పు వెల్లడించింది. ఈ కేసును ’అత్యంత ప్రాధాన్యమైనది’గా భావించాలని సీబీఐ చీఫ్‌కు సూచించిన న్యాయస్థానం.. ఆరు నెలల్లోగా దాణా కుంభకోణం కేసులన్నింటి విచారణను పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చోటుచేసుకున్న పశువుల దాణా కుంభకోణంపై దర్యాప్తు చేసిన సీబీఐ.. మొత్తం నాలుగు కేసులను నమోదుచేసింది. వీటిల్లో ఒక కేసుకు సంబంధించి 2013లోసీబీఐ కోర్టు లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించి, ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. నాటి తీరపును సవాలు చేస్తూ లాలూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. 2014లో జార్ఖండ్ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఐపీసీ సెక్షన్ 120, 120B, 409, 420, 471, 477, 477A, 13(2)ల కింద సీబీఐ లాలూపై మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ విచారణకు నేడు కోర్టు అంగీకారం తెలిపింది.