
నిర్భయ తల్లి ఆశాదేవి, నలుగురు దోషులు
న్యూఢిల్లీ: సంచలనాత్మక నిర్భయ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తుది తీర్పుపై దేశవ్యాప్తంగా హర్శాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఆటవికరీతిలో దారుణానికి ఒడిగట్టిన దోషులకు ఉరే సరైన శిక్ష’ అన్న న్యాయమూర్తుల అభిప్రాయానికి ఎల్లడలా మద్దతు లభిస్తోంది.
తీర్పు వెలువడిన తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టకేలకు మాకు న్యాయం జరిగిందని అన్నారు. ‘మే 10 మా బిడ్డ జ్యోతి పుట్టిన రోజు. ఆమె బతికిఉండేదుంటే 29వ ఏట అడుగుపెట్టిఉండేది’అని ఆశాదేవి కన్నీటిపర్యంతం అయ్యారు. న్యాయపోరాటంలో సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆలస్యం జరిగినా నేటి తీర్పుతో తామెంతో సంతోషంగా ఉన్నామని, ఇది తమ కుటుంబానికి దక్కిన విజయమని నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ అన్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ నిర్భయ కేసులో సుప్రీం తీర్పుపై స్పందిస్తూ.. ‘అత్యాచార ఘటనల్లో మహిళలుకాదు, రేపిస్టులు సిగ్గుపడాలి. అందుకే ఇక నిర్భయను.. ఆమె తల్లి కోరినట్లే సొంత పేరైన జ్యోతి అనే పిలుద్దాం. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష నిజంగా ఓ చరిత్రాత్మక తీర్పు’ అని అన్నారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ మాట్లాడుతూ ఈ తీర్పు విన్నాక సంతోషపడ్డానని చెప్పారు. నాలుగున్నర ఏళ్లపాటు నిర్భయ తల్లిదండ్రులు సాగించిన న్యాయపోరాటానికి సరైన ఫలితం దక్కిందని ప్రముఖ సినీ నటుడు రాహుల్ దేవ్ వ్యాఖ్యానించారు.
ధర్మాసనంలో మహిళా జడ్జి విభిన్న తీర్పు
ప్రత్యేక కోర్టు, ఢిల్లీ హైకోర్టులు తమకు విధించిన మరణ శిక్షను రద్దుచేయాలని కోరుతూ.. నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనంలో ఇద్దరు జడ్జిలు ఒక రకంగా మూడోవారైన మహిళా జడ్జి మాత్రం ఇంకోరకంగా తీర్పు చెప్పడం గమనార్హం. ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్ దీపక్ మిశ్రా సహా జస్టిస్ అశోక్ భూషణలు నిర్భయ దోషులకు ఉరిశిక్షే సరైనదని తీర్పు చెప్పగా జస్టిస్ భానుమతి మాత్రం ఈ సమస్యను విశాల దృక్ఫథంతో ఆలోచించాలని అన్నారు. ఆడపిల్లలను, మహిళలను గౌరవించే సంస్కారాన్ని నేర్పే విద్యావ్యవస్థ అవసరమని జస్టిస భానుమతి కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2-1 తేడాతో దోశులకు ఉరిశిక్షను ఖరారుచేసింది.
(చదవండి: నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారు)