పాక్ యువతకు మరింత దగ్గరైన సుష్మా | Sushma Swaraj keeps word; gets Pakistan girl medical seat | Sakshi
Sakshi News home page

పాక్ యువతకు మరింత దగ్గరైన సుష్మా

Published Thu, Oct 6 2016 11:56 AM | Last Updated on Sat, Mar 23 2019 8:44 PM

పాక్ యువతకు మరింత దగ్గరైన సుష్మా - Sakshi

పాక్ యువతకు మరింత దగ్గరైన సుష్మా

జైపూర్ : ఆడబిడ్డలు ఎవరికైనా ఆడబిడ్డలేనని పేర్కొంటూ 19మంది పాకిస్తానీ బాలికలను సురక్షితంగా వారి దేశానికి పంపించి ఆ దేశ యువత మనసు గెలుచుకున్న విదేశీవ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్, మరోసారి తనదైన శైలిలో పాకిస్తానీలకు మరింత చేరువయ్యారు. మాషల్ మహేశ్వరి అనే ఓ పాకిస్తానీ టీనేజ్ బాలికకు జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ మెడికల్ కాలేజ్(ఎస్ఎమ్ఎస్)లో అడ్మిషన్ ఇప్పించారు. సుష్మా సహకారంతో సెప్టెంబర్ 22న ఎస్ఎమ్ఎస్ కాలేజీలో చేరిన మాషల్ మహేశ్వరి వెంటనే సుష్మాస్వరాజ్కు తన కృతజ్ఞతాపూర్వక సందేశం పంపించింది. తన జీవిత కలసాకారం చేయడానికి సహకరించినందుకు సుష్మాజీ తమకు థ్యాంక్స్ అని చెప్పింది. ఇటీవలే పాక్ బాలికలను సురక్షితంగా వారి దేశానికి పంపిస్తానని భరోసా ఇచ్చి మాట నిలబెట్టుకున్న సుష్మాపై ఆ దేశ యువత ప్రశంసల వర్షం కురిపించారు. మరోసారి పాక్ బాలికకు ఇక్కడి కాలేజీలో సీటు ఇప్పించి నెటిజన్ల మన్ననలు పొందుతున్నారు.  
 
హిందూ మైనార్టీలపై జరుగుతున్న అరాచకాలు భరించలేక పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్కు చెందిన మహేశ్వరి కుటుంబం రెండేళ్ల క్రితమే మతవీసాపై జైపూర్కు వచ్చింది. ప్రతిభావంతురాలైన మహేశ్వరి 12వ తరగతి సీబీఎస్ఈ ఎగ్జామ్స్లో 91 శాతం మార్కులు సంపాదించింది. తన జాతీయత వల్ల మెడికల్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ను మహేశ్వరి రాయలేకపోయింది. 2016 మే 29న ఆమె దీనిపై కేంద్రమంత్రికి లేఖ రాసింది. మహేశ్వరి లేఖపై వెంటనే స్పందించిన సుష్మా'మాషల్ నీవు నిరుత్సాహానికి గురికావద్దు, మెడికల్ కాలేజీలో  అడ్మిషన్ కోసం నేను నీ కేసును వ్యక్తిగతంగా పరిశీలిస్తాను' అని ట్వీట్ చేశారు. అనంతరం అడ్మిషన్కు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మహేశ్వరిని కోరింది. కాలేజీలో జాయిన్ అయిన మహేశ్వరి వెంటనే సుష్మా స్వరాజ్కు కృతజ్ఞతలు తెలిపి, న్యూరాలజిస్ట్ లేదా కార్డియాలజిస్ట్ అయి భారత దేశం కోసం తను జీవితాంతం పనిచేస్తానని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement