'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు'
'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు'
Published Tue, Feb 14 2017 12:01 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష పడటంతో.. తమిళనాడులో అంతా దీపావళి చేసుకుంటున్నారని అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రౌడీయిజం, కుటుంబ పాలన ముగిసిపోయాయని అన్నారు. తమిళనాడు రాష్ట్రం ఇన్నాళ్లకు ఊపిరి పీల్చుకుంటోందని చెప్పారు. తన మీద కూడా నాలుగైదు తప్పుడు కేసులు పెట్టించారని, వాటి నుంచి బయట పడేందుకు తాను క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశానని ఆమె తెలిపారు. శశికళా నటరాజన్, ఆమె కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ జయలలిత తనను ఏనాడూ పక్కన పెట్టలేదని, ఆమెను అందరూ అభిమానిస్తారని తెలిపారు.
ఆమె పేదల కోసం, మహిళల కోసం, పిల్లల కోసం చాలా చేశారని, అందువల్ల ఆమె పట్ల ప్రతి ఒక్కరికీ అభిమానం ఉందని శశికళా పుష్ప అన్నారు. శశికళకు శిక్ష పడటం మీద ఏ ఒక్కరూ బాధపడటం లేదని, ఆమె చాలా పెద్ద క్రిమినల్ అని వ్యాఖ్యానించారు. తనలాగ ప్రతి ఒక్కరూ అమ్మకు విశ్వాస పాత్రులుగా ఉండటం ఆమెకు ఇష్టం లేదన్నారు. పన్నీర్ సెల్వం, మైత్రేయన్, పాండియన్ లాంటి చాలామంది పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డామని, తామందరినీ పక్కనపెట్టి శశికళా నటరాజన్ కుటుంబ రాజకీయాలు చేసిందని, ఆమె మీద గట్టిగా పోరాటం చేసిన మొట్టమొదటి నాయకురాలిని తానేనని, అందుకే తనను బహిష్కరించారని అన్నారు. ఇప్పుడు ఆమెకు శిక్షపడి, రాజకీయాలకు దూరం కావడం పట్ల తనలాంటి వాళ్లందరికీ చాలా సంతోషంగా ఉందని ఎంపీ శశికళా పుష్ప చెప్పారు.
శశికళ కేసు.. మరిన్ని కథనాలు
Advertisement