లిబియాలో తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్
నలుగురు భారతీయుల అపహరణ
ఇద్దరి విడుదల.. చెరలోనే మనవాళ్లిద్దరు
ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల ఘాతుకమేనని అనుమానం
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్, బెంగళూరు: ఇద్దరు తెలుగువారు సహా నలుగురు భారతీయ ప్రొఫెసర్లు లిబియాలో కిడ్నాప్‌నకు గురయ్యారు. వీరిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు శుక్రవారం సాయంత్రం విడుదల కాగా హైదరాబాద్‌కు చెందిన చిలువేరు బలరామ్ కిషన్, తిరువీధుల గోపీకృష్ణ ఇంకా ఉగ్రవాదుల చెరలోనే మగ్గుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిర్త్‌లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న ఈ నలుగురూ బుధవారం ట్రిపోలి మీదుగా భారత్‌కు వస్తుండగా వర్సిటీకి 50 కి.మీ. దూరంలోని ఓ చెక్‌పాయింట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ రాజ్యస్థాపన కోసం ఇరాక్, సిరియాలలో నెత్తుటేర్లు పారిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్ శుక్రవారం విడుదలయ్యారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మిగతా ఇద్దరినీ విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోదీకి వివరణనిచ్చారు. కాగా, ఐఎస్ మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో లిబియా నుంచి వచ్చేయాలంటూ అక్కడి భారతీయులకు కేంద్రం ఏడాది క్రితమే సూచనలు జారీచేసింది. ఇరాక్‌లో గతేడాది 39 మంది భారతీయులు కిడ్నాప్ కాగా, ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు.
మా వారిని రప్పించండి..: కరీంనగర్ జిల్లా శనిగారం గ్రామానికి చెందిన చిలివేరు బలరామ్ కిషన్ కుటుంబం... హైదరాబాద్‌లో అల్వాల్ మానస సరోవర్‌లోని సాయిసాగర్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు. ఇతని భార్య శ్రీదేవి ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు విజయ్‌భాస్కర్ బీటెక్, చిన్న కుమారుడు మధుసూదన్ ఏడో తరగతి చదువుతున్నారు. బలరామ్ ఐదేళ్ల క్రితం సిర్త్ వర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బలరామ్ ఈ నెల 29న రాత్రి 7 గంటలకు లిబియా నుంచి ఇంటికి బయలుదేరుతున్నానంటూ ఫోన్ చేసి భార్య శ్రీదేవితో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. తన భర్త, గోపీకృష్ణలను భారత్‌కు రప్పించాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
‘వీ ఆర్ సేఫ్’ అంటూ సందేశం: కిడ్నాప్‌నకు గురైన వారిలో ఒకరైన లక్ష్మీకాంత్ నుంచి బలరామ్ భార్య శ్రీదేవి సెల్‌ఫోన్‌కు శుక్రవారం సాయంత్రం 6.05 గంటలకు ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. ‘వి ఆర్ సేఫ్ హియర్ ఇన్ సిర్త్ యూనివర్సిటీ డోన్ట్ వర్రీ’ (మేము సిర్త్ యూనివర్సిటీలో సురక్షితంగా ఉన్నాం. ఆందోళన వద్దు) అని అందులో పేర్కొన్నారు.
భారత్ వస్తూ బందీగా...
ఆందోళనలో తెలుగు కుటుంబాలు
నలుగురు ప్రొఫెసర్లను గుర్తుతెలియనిదుండగులు కిడ్నాప్ చేసిన విషయాన్ని వారు ప్రయాణించిన కారు డ్రైవర్ హైదరాబాద్‌లోని గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన మురళీ ట్రిపోలీలో ఉన్న స్నేహితులను సంప్రదించడంతో పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణతో కలిసి పన్నెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి నాచారం ప్రాంతంలో స్థిరపడ్డారు. డిగ్రీ వరకు టెక్కలిలో చదువుకున్న గోిపీ, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెస్సీ, తమిళనాడు కాంచీపురంలోని మీనాక్షి అమ్మన్ కళాశాలలో ఎంటెక్ చదివారు.
బలరాం అదృశ్యంపై టీవీలో వార్త చూసి ఆందోళన చెందుతున్నభార్య శ్రీదేవి
ఈయనకు 2004లో కళ్యాణితో వివాహమైంది. వీరి కుమార్తె జాహ్నవి (10) నాలుగో తరగతి, కుమారుడు కృష్ణ సాయికిశోర్ (4) యూకేజీ చదువుతున్నారు. 2004 నుంచి 2007 వరకు నల్గొండ జిల్లా భువనగిరిలోని అరోరా కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కుటుంబంతో లిబియాకు వలసవెళ్లి హున్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2011లో భార్యాపిల్లల్ని నాచారం రాఘవేంద్రనగర్‌కు పంపారు. ప్రస్తుతం స్రిట్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన తల్లిదండ్రులు వల్లభనారాయణరావు, సరస్వతితోపాటు అమ్మమ్మ టెక్కలిలో నివసిస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీకి రంజాన్ సెలవులు కావడంతో కుటుంబసభ్యులతో గడపటానికి బుధవారం భారత్‌కు పయనమయ్యారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, ఆ జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం గోపీకృష్ణ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.