పేదలకు కేంద్ర బడ్జెట్‌లో వరాలు!
న్యూఢిల్లీ: తాను ఈసారి ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్‌లో పేదలకు, గ్రామీణ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్టు పేర్కొన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్‌లో పేదలకు పలు వరాలు ప్రకటించారు. పేదలు, అణగారిన వర్గాల బలోపేతానికి సామాజిక భద్రత కల్పిస్తామని, ఆరోగ్య సంరక్షణతోపాటు పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు రూ. 15వేల కోట్ల నుంచి రూ. 23వేల కోట్లకు బడ్జెట్‌లో నిధులు పెంచుతున్నట్టు చెప్పారు.
2019నాటికి ఇళ్లులేనివారు, దుర్బలమైన (కచ్ఛా) ఇళ్లలో ఉంటున్నవారి కోసం కోటి పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జైట్లీ వెల్లడించారు. 2018 మే 1 నాటికి 100శాతం గ్రామాలకు విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు. వ్యవసాయ, గ్రామీణ, దాని అనుబంధ రంగాలకు ఈసారి బడ్జెట్‌లో రూ. 1,87,223 కోట్లు కేటాయించామని, ఇది గత ఏడాది బడ్జెట్ కంటే 24శాతం అధికమని జైట్లీ స్పష్టం చేశారు.