వెంకయ్యనాయుడు అను నేను..
- భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన తెలుగుతేజం
- దర్బార్‌హాలులో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి కోవింద్
న్యూఢిల్లీ: దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో తెలుగువారైన వెంకయ్యనాయుడు ఆశీనులయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో శుక్రవారం ఉదయం భారత ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. వెంకయ్యతో ప్రమాణం చేయించారు.
‘వెంకయ్య నాయుడు అను నేను.. రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత ప్రదర్శిస్తానని ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేస్తున్నా ’ అంటూ హిందీలో ప్రమాణం చేశారు. అనంతరం పుస్తకంలో సంతకం చేశారు. కొత్త ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మొదటిగా రాష్ట్రపతి కోవింద్ అభినందించారు.
అటుపై మొదటి వరుసలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు.. ఉపరాష్ట్రపతికి నమస్కరించారు. 10 నిమిషాలపాటు సాగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, విపక్షాలకు చెందిన కీలక నేతలు, రాష్ట్రాల సీఎంలు, పలు దేశాల రాయబారులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్‌ఘాట్‌కు వెళ్లిన వెంకయ్య.. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. సర్దార్ వల్లభాయి పటేల్, దీన్‌దయాళ్ ఉపాథ్యాయలకు కూడా వెంకయ్య పుష్పాంజలిఘటించారు.